life journey of bharat biotech founder: నలభై ఏళ్ల కిందటి మాట... తమిళనాడు తిరుత్తణిలోని నెమలిగ్రామం అది. అక్కడ ట్రాక్టర్‌తో అరక దున్నడమంటే భలే సరదా కృష్ణ ఎల్లకి. వేకువనే వెళితే మళ్లీ ఇంటి ముఖం పట్టేది సాయంత్రానికే. ‘ఇంత చదువూ చదివి ఎందుకురా... ఈ సేద్యం’ అనేవాడు తండ్రి. ‘నేను చదివేదే సేద్యం కోసం కదా... నాన్నా!’ అన్నది కృష్ణ సమాధానం. పట్నం చదువులకెళ్లిన కొడుకు కాళ్లకి మట్టి అంటకుండా తిరగాలన్నది ఆ తండ్రి కోరిక! తాను చిన్నప్పటి నుంచీ నేర్చిన సాగుని శాస్త్రీయంగా విశ్వవిద్యాలయంలో చదవాలీ అన్నది కొడుకు అభిమతం. ఏదేమైతేనేం, కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చేసిన కృష్ణ ఎల్ల ఆ తర్వాత బెంగళూరులో అదే సబ్జెక్టుపైన పీజీ చేస్తున్నప్పుడే సుచిత్ర ఆయనకి పరిచయమయ్యారు. పరిచయమంటే... పెళ్ళిచూపులతో ఏర్పడ్డ పరిచయం మరి. సుచిత్ర పుట్టిపెరిగింది చెన్నైలోనే. ఆమె తండ్రి అక్కడ కేంద్రప్రభుత్వ ఉద్యోగి. యతిరాజ్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ చదువుకున్నారు సుచిత్ర. డిగ్రీ ముగించగానే తిరుత్తణి నెమలిగ్రామంలోని తెలుగువాళ్లైన ఎల్లావారితో సంబంధం కుదిరింది. పెళ్ళయ్యాక కృష్ణ ఎల్ల్లకి రోటరీ సంస్థ ఫెలోషిప్‌తో అమెరికాలో మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది. సుచిత్రకీ అక్కడ సీటు దక్కింది. అమెరికా విస్కాన్సిన్స్ వర్సిటీలో ఆయన మాలిక్యులర్ బయోలజీలో మాస్టర్స్‌లో చేరితే... ఆమె బిజినెస్ డెవలప్‌మెంట్ డిప్లమోలో జాయినయ్యారు.
ఆ కోర్సు తర్వాత ఆమె ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగానికి వెళ్లారు. అప్పటికే కృష్ణకి టీకాల రూపకల్పనపైన ఆసక్తి కలిగి... అందులో పీహెచ్‌డీకి చేరారు. అది పూర్తయ్యేనాటికే 12 ఏళ్లు గడిచాయి... ఇద్దరు పిల్లలు. టీకా తయారీపైన కృష్ణ ఎల్ల చేస్తున్న పరిశోధనలు భారతదేశానికీ ఉపయోగపడాలని సుచిత్ర భావించారు. ఇందుకోసం ఇండియాలోనే ఓ పరిశోధనా సంస్థని ప్రారంభించాలనుకున్నారు. అదే మాట అంటే కృష్ణ ఇష్టపడలేదు... ‘ఇక్కడ స్థిరపడిపోయాం కదా!’ అన్నది ఆయన వాదన. ఓ దశలో తన అత్తయ్య ద్వారానూ ఒత్తిడి పెంచి... ఆయన్ని ఒప్పించారు సుచిత్ర. అమెరికాలో ఉండగానే ‘భారత్ బయోటెక్ లిమిటెడ్’ కంపెనీ పనులు మొదలుపెట్టారిద్దరూ. కృష్ణ కామెర్ల టీకా తయారీపైన దృష్టిపెడితే... సుచిత్ర సంస్థ ఏర్పాటుకు కావాల్సిన ఖర్చూ, తీసుకోవాల్సిన ప్రభుత్వ అనుమతులూ, సిబ్బంది నియామకాలలో తలమునకలయ్యారు.
25 ఏళ్ల ముందు...
Bharat Biotech in hyderabad: 1996లో హైదరాబాద్‌లో ప్రారంభమైంది భారత్ బయోటెక్ సంస్థ. పెట్టుబడుల కోసం ఎంతో ప్రయాసపడ్డాక 12.5 కోట్ల రూపాయల పెట్టుబడితో సంస్థని ప్రారంభించారు ఎల్ల దంపతులు. మూడేళ్ల తర్వాత ఓ పెద్ద సంస్థతో పోటీపడి మరీ కామెర్ల నివారణకి అవసరమైన హెపటైటిస్-బి టీకాని ఆవిష్కరించారు. 1700 రూపాయలున్న దాన్ని యాభైరూపాయలకి అందించడంతో... దేశ ఆరోగ్యరంగం దృష్టి తొలిసారి వీళ్లపైన పడింది. మరో మూడేళ్లకి- అంటే 2002లో... ప్రపంచానికి తొలిసారి కరోనా వైరస్ గురించి తెలిసింది. దాన్ని సార్స్-కోవ్(సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్)గా గుర్తించింది శాస్త్ర ప్రపంచం. చైనాలో పుట్టిన ఈ వైరస్ అప్పట్లో ఎనిమిదివేల మందికి సోకి... 774 మంది ప్రాణాలు తీసింది. కానీ దాన్ని స్థానికంగానే అరికట్టడంతో టీకాల అవసరం రాలేదు. అయితేనేం- ఓ టీకా శాస్త్రవేత్తగా అప్పటి నుంచీ చైనా వైపు దృష్టిపెట్టారు కృష్ణ ఎల్ల. 2006లో అక్కడే తొలిసారి ‘ఎవియన్ ఫ్లూ’(హెచ్5ఎన్1) వచ్చినప్పుడు కేంద్రప్రభుత్వం ఈ దంపతులనే సంప్రదించింది. మరో మూడేళ్లకి ప్రపంచాన్ని వణికించిన స్వైన్ ఫ్లూకీ దేశంలోనే తొలి టీకాని కనిపెట్టారు. ఆ తర్వాత జికా, చికన్‌గున్యాలకీ వ్యాక్సిన్‌లు కనిపెట్టే పనిలో పడ్డారు. అక్కడి నుంచి 2019 దాకా 16 టీకాలు కనిపెడితే... వాటిలో చాలావరకు ప్రాణాంతక వైరస్‌లకి సంబంధించినవే. మరి అన్ని వైరస్‌ల తీరుతెన్నుల్ని చూసిన కృష్ణ... ప్రపంచానికి ఓ పెద్ద వైరస్ ముప్పు ఉందని ఊహించారా అంటే... ‘ఊహించాను కానీ అదేమీ అశాస్త్రీయమైన కల్పన కాదు... దాదాపు 19 ఏళ్లుగా వైరస్‌లని గమనిస్తున్నవాళ్లెవరైనా చెప్పగలిగేదే. కాకపోతే దానికి నా ఇన్‌ట్యూషన్ కాస్త తోడైంది!’ అని చెబుతారాయన. ఆ ఇన్‌ట్యూషన్‌తోనే- 2019 డిసెంబర్ ప్రారంభంలో ఆయన ఓ సదస్సులో ప్రసంగిస్తూ... ‘ప్రపంచం త్వరలో ఓ పెద్ద వైరస్ ముప్పుని చూడబోతోంది. ‘అయితే మనకేమిటీ?’ అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ఆ వైరస్ వల్ల మీరు ఏళ్ల తరబడి ఇంటికే పరిమితం కావాల్సి రావొచ్చు. ప్రస్తుతం కొన్ని సంస్థల్లో, అదీ మహిళలకే పరిమితమైన వర్క్ ఫ్రమ్ హోమ్ అందరికీ వర్తించవచ్చు. అసలు ఆఫీసుల అవసరమే రాకపోవచ్చు...!’ - కృష్ణ ఎల్ల ఈ మాటలన్నది సామాన్యులతో కాదు... ఐటీ దిగ్గజాలతో. ఆ రంగానికి చెందిన ప్రతినిధులతో కార్నెగీ మెలన్ ఫౌండేషన్ సంస్థ ఏర్పాటుచేసిన సదస్సు అది. ఆ మాటలు విన్నవాళ్లు విస్మయానికి గురైనా... ఆ ఆశ్చర్యం మూడువారాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. ఎందుకంటే... ఆయన ఆ ప్రసంగం చేసిన మూడువారాలకే చైనాలోని వుహాన్‌లో కరోనా వ్యాప్తి మొదలైంది. మరో వారానికి- భారత్‌లో తొలి కరోనా కేసు నమోదైంది.
2020 జనవరి- మొదటివారం...
ఓ ప్రమాదకరమైన వైరస్‌తో ప్రపంచానికి పెనుముప్పు పొంచి ఉందన్న భావన... ఆరేళ్లకిందటే కలిగిందంటారు కృష్ణ ఎల్ల. అందుకే జినోమ్‌వ్యాలీలోని తన ప్లాంట్‌లో ‘బీఎస్‌ఎల్-3’(బయోసేఫ్టీ లెవల్-3) స్థాయి టీకా తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. బయట నుంచి కరోనాలాంటి సూక్ష్మక్రిములు కాదుకదా... గాలికూడా చొరబడే అవకాశం లేని కేంద్రం ఇది. అక్కడి నుంచి ఏ సూక్ష్మాణువూ బయటకొచ్చే అవకాశం ఉండదు. సుమారు నాలుగేళ్లపాటు శ్రమించి నిర్మించిన ఈ తయారీకేంద్రం... ఈ తరహావాటిల్లో ప్రపంచంలోనే మొదటిది!
NIV Lab in PUNE: ఇక, ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’(ఎన్‌ఐవీ) ప్రభుత్వ సంస్థ. పుణెలోని ఈ ల్యాబ్‌లోనే మనదేశంలో తొలిసారి కరోనా వైరస్‌ని గుర్తించారు. ఆ వైరస్‌ని ఓ పంది కిడ్నీలో ప్రవేశపెట్టి... అభివృద్ధి చేశారు. ఆ తర్వాత దాని జన్యువుని నిర్ధారించారు. ప్రపంచంలో కేవలం ఓ ఐదు దేశాలే ఇలా చేయగలిగితే... అందులో భారతదేశాన్ని కూడా సగర్వంగా నిలిపారు. 2012లో ఏర్పాటైన ఎన్‌ఐవీ దేశంలోనే అత్యాధునికమైంది. ప్రపంచంలో నాలుగుచోట్ల మాత్రమే ఉన్న ‘బీఎస్‌ఎల్-4’ ల్యాబ్ దీని సొంతం. తమ భారత్ బయోటెక్ సంస్థలోని శాస్త్రవేత్తల పరిశోధనా సామర్థ్యానికి ఈ ల్యాబ్‌లోని వసతులూ, కేంద్రప్రభుత్వం అందించే అత్యవసర అనుమతులూ తోడైతే అద్భుతాలు చేయొచ్చని భావించారు సుచిత్ర ఎల్ల. దాంతో- తమ టీకా ప్రయత్నంలో భాగస్వాములుగా ఉండాలని కోరుతూ
కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఆమె తీసుకున్న ఆ నిర్ణయం వల్లే ఏళ్ళూపూళ్ళూ పట్టాల్సిన కొవాగ్జిన్ తయారీకి... ఏడాదికన్నా తక్కువ సమయమే పట్టింది! ఈ రాతకోతలన్నీ పూర్తవడానికి మరో రెండు నెలలు పట్టాయి. ఈలోపు దేశంలో తొలి లాక్‌డౌన్ విధించారు...
మార్చి నుంచీ...
ఓ నట్టనడి వేసవి మిట్టమధ్యాహ్నం అది. దేశమంతా లాక్‌డౌన్... కర్ఫ్యూ పరిస్థితిని తలపిస్తోంది. హైదరాబాద్‌లో అడపాదడపా తప్ప వాహనాల ఊసేలేదు. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ రెండు కార్లు... జినోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ లిమిటెడ్ ప్లాంట్ నుంచి బయల్దేరాయి. ఆ సంస్థకి చెందిన ఓ సైంటిస్టుల బృందం పుణెవైపు ప్రయాణిస్తోంది. ఎన్‌ఐవీ ‘పెంచి పోషించిన’ కరోనా వైరస్‌ని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కి తీసుకురావడం వీరి లక్ష్యం. టీకా తయారీకి- వీళ్లు తెస్తున్న ఆ వైరస్సే కీలకం. మామూలుగానైతే అలాంటి వైరస్‌లని తీసుకురావడానికి ‘ఎయిర్‌కార్గో’ విమానాలని బుక్ చేస్తారు సుచిత్ర ఎల్ల. కానీ... ఫ్లైట్ల రద్దు కారణంగా ఆ అవకాశం పోయింది. డ్రైవర్‌లకి ఓ అసిస్టెంట్‌ని తోడిచ్చి పంపించాలనీ అనుకున్నారట కానీ... సీనియర్ సైంటిస్టు డాక్టర్ వీకే శ్రీనాథ్ దానికి ఒప్పుకోలేదు. ‘ఇది జనాల ప్రాణాలకి సంబంధించిన విషయం, మనమూ వెళ్లాల్సిందే!’ అంటూ ఆయనా బయల్దేరారు. పుణె ల్యాబ్‌లో సిద్ధంచేసిన వైరస్ మామూలుదానికన్నా వెయ్యిరెట్లు శక్తిమంతంగా ఉంటుంది. దాన్ని తెచ్చేటప్పుడు ఏదైనా తేడా వచ్చి వైరస్ బయటపడిందా... వందలాది ప్రాణాలు పోతాయి. అందుకే శ్రీనాథ్ తనతోపాటూ మరో సైంటిస్టునూ, అదనంగా మరో కారునీ తీసుకెళ్లారు. పుణె ల్యాబు అందించిన వైరస్‌ని అతిజాగ్రత్తగా చిన్న రిఫ్రిజరేటర్‌లో పెట్టుకుని... రాత్రికి రాత్రే బయల్దేరారు. దాదాపు 20 గంటల ప్రయాణంలో... రెండు ల్యాబుల నడుమ... ఎక్కడా కారుని ఆపలేదట వీళ్లు... కనీసం ప్రకృతి అవసరాలకు కూడా!
ఆ 5 నెలలూ...
Modi visit Bharat Biotech: వైరస్‌ని తేవడం ఒకెత్తు అయితే... దాన్ని బీఎస్‌ఎల్-3 ల్యాబ్‌లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఆ బాధ్యత తీసుకున్నారు మరో సైంటిస్టు విజయ్. ఆ తర్వాతే టీకా తయారీ యజ్ఞం మొదలైంది. ఇందుకోసం 22 మంది నిష్ణాతులైన శాస్త్రవేత్తల్ని ఎంపికచేసి... వాళ్లకి తానే నేతృత్వం వహించారు డాక్టర్ కృష్ణ ఎల్ల. అతి ప్రమాదకరమైన వైరస్‌తో పనిచేస్తున్నారు కాబట్టి... ఎవ్వరూ ఇళ్లకి వెళ్లకూడదని సంకల్పించుకున్నారు. రోజూ 18 గంటల పని తర్వాత... పక్కనే వీళ్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఫ్లాట్‌లలోనే ఉండేవారు. అలా ఐదు నెలలపాటు భార్యాపిల్లలకి దూరంగానే ఉండిపోయారు వాళ్లు. అలా దూరంగా ఉన్నామన్న బాధ కనిపించినప్పుడల్లా ఎండీ కృష్ణ ఎల్ల దంపతులు చెప్పిన మాటలే వాళ్ల చెవుల్లో రింగుమనేవట... ‘మనం తింటున్న ప్రతి గింజా ఇక్కడి సామాన్య రైతులు పండించింది. మనం నేర్చిన చదువులన్నీ మన ప్రజలు తమ పన్నులతో మనకు పెట్టే భిక్ష. వాళ్లకి కృతజ్ఞతలు చెప్పే సమయం ఇది!’ అని. ఆ మాటలు నింపిన స్ఫూర్తే కొవాగ్జిన్‌కి ప్రాణంపోసింది. ఆ పోరాటంలోని ప్రతి దశా ఉత్కంఠభరితంగానే సాగింది...
కోట్ల వైరస్‌ల సృష్టి...
మొదట పుణె నుంచి తెచ్చిన వైరస్‌ని అత్యాధునిక ‘ఫెర్మెంటర్’ యంత్రంలో అభివృద్ధి చేస్తారు... కోట్లాది వైరస్‌లుగా మారుస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన ప్రక్రియ. ఆ ఫెర్మెంటేషన్ ఒకవేళ పేలితే... దేశంలోని 130 కోట్లమందికీ వైరస్ సోకే ప్రమాదముంటుంది. దాదాపు నెలపాటు వాటిని అభివృద్ధి చేశాక... ఆ శక్తిమంతమైన వైరస్‌ని బలహీనపరుస్తారు. అంటే, వైరస్ రాక్షసుడిని చంపకుండా దాని గుండెకాయలాంటి ‘ఆర్‌ఎన్‌ఎ’ని నిర్వీర్యం చేస్తారు. అలా చేయడం వల్ల అది శరీరంలోకి వచ్చినా తనని తాను పునఃసృష్టించుకోలేదు. అలా నిర్వీర్యమైన వైరస్‌లతో టీకా నమూనాలని తయారుచేశారు. వాటిని తొలిసారి కుందేళ్లు, చిట్టెలుకలకూ, తరవాత పందికొక్కులకూ వేశారు. ఈ వైరస్ ఆ జంతువుల్ని చంపినా... తీవ్ర అనారోగ్యానికి గురిచేసినా... టీకా ప్రయోగం విఫలమైందనే అర్థం. అందువల్ల నరాలు తెగే టెన్షన్‌తో ఆ జంతువుల్ని గమనిస్తూ ఉండిపోయారు సైంటిస్టులు. వాటికేమీ కాలేదు. నెలతర్వాత ఆ జంతువుల రక్త నమూనాలని పరిశీలిస్తే కరోనాని ఎదుర్కొనే యాంటీబాడీలూ పుష్కలంగా కనిపించాయట. దాని అర్థం... వీళ్ల టీకా పనిచేస్తోందని. ఆ తర్వాతి ప్రయోగమే అసలైంది...