జీఎస్టీ సవరణలకు వ్యతిరేకంగా అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) ఇవాళ దేశవ్యాప్త బంద్ తలపెట్టింది. దిల్లీ సహా దేశవ్యాప్తంగా చిన్న,పెద్దా కలిపి 1500 వాణిజ్య సంస్థలు మూసివేయనున్నట్లు తెలిపింది. ఈ బంద్‌లో 8 కోట్ల మంది వ్యాపారులకు సంబంధించిన 40 వేల వాణిజ్య సంఘాలు పాల్గొంటాయని, 40 లక్షల వాహనాలు నిలిచిపోతాయని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాల్ తెలిపారు.
నేడు భారత్ బంద్- నిరసనలో 40 వేల వాణిజ్య సంఘాలు
జీఎస్టీ నిబంధనలను సమీక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ). ఈ నేపథ్యంలో నేడు దేశంలోని అన్ని వాణిజ్య మార్కెట్లు మూసిఉంటాయని సీఏఐటీ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఇంధనధరలు ఒకేలా ఉండాలని, ఈ-కామర్స్ సంస్థలపై నియంత్రణ, జీఎస్టీ సవరణలకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం, హాకర్స్ సంయుక్త కార్యాచరణ సంఘం, హాకర్స్ జాతీయ కార్యవర్గం సహా పలుసంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. భారత్ బంద్‌లో భాగంగా చక్కాజామ్‌కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు ఖండేల్‌వాల్. దేశవ్యాప్తంగా 1,500 ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతాయని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మందుల దుకాణాలు, పాలు, కూరగాయల దుకాణాలకు మినహాయింపు ఇచ్చినట్లు భారత వ్యాపారుల సమాఖ్య తెలిపింది. అయితే ఈ బంద్‌కు అఖిల భారత వ్యాపార మండలి, భారతీయ ఉద్యోగ వ్యాపార మండలి దూరంగా ఉన్నాయి