కరోనా కట్టడికి లాక్డౌన్ విధించడం వల్ల మొత్తం షాపింగ్ మాళ్లు అన్నీ మూతపడిపోయాయి. దీంతో వేరే గత్యంతరం లేక ఆన్లైన్ షాపింగ్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆన్లైన్ కొనుగోళ్లకు ప్రజలు అలవాటు పడటం వల్ల ప్రస్తుతం ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఒక్క క్లిక్‌తో కిరాణా సరకుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు గుమ్మం వద్దకే తీసుకొచ్చే 'ఈ-షాపింగ్'వైపే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు.
ఈ కొనుగోళ్లలో చాలా వరకు ఆన్లైన్ ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉన్నా... డిస్కౌంట్లు, మరేదైనా ఆఫర్ల కోసమో.. క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారానే డబ్బులు కట్టేస్తున్నాం. ఇక్కడే అసలు చిక్కొచ్చిపడుతోంది. ఆన్లైన్ వ్యాపారం ఎలాగైతే మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందో... అదే విధంగా సైబర్ నేరగాళ్లు తమ మాయాజాలంతో ప్రజల్ని వలలో వేసుకోవడానికి యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. వినియోగదారుల సమాచారాన్ని చాకచక్యంగా తస్కరిస్తున్నారు.
వీరి బారిన పడ్డ అనేక మంది.. 'మేం మోసపోయాం మొర్రో' అంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ కరోనా సంక్షోభంలో మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్కు ఇలాంటి కేసులు వందల సంఖ్యలో వచ్చిపడ్డాయి.
ఎలా దొంగలిస్తారు?
ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు పెద్ద ఎత్తున జరుగుతున్నందున సైబర్ కేటుగాళ్లు కొత్త మార్గాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ప్రజల్ని మోసం చేసేందుకు నయా పంథా అవలంబిస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీల కోసం నూతన ప్రోగ్రామ్ కోడ్‌ను రూపొందించారు. ఈ ప్రోగ్రామ్‌ను ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో.. మభ్యపెట్టే విధంగా అమర్చుతారు.
వినియోగదారులు షాపింగ్ వెబ్సైట్లో తమ సమాచారం నమోదు చేయడం ఆలస్యం.. ఈ ప్రోగ్రామ్ మొత్తం డేటాను చోరీ చేసి నేరగాళ్ల చేతిలో పెడుతుంది. డెబిట్/క్రెడిట్ కార్డు పిన్ నెంబర్లు, ఇంటర్నెట్ బ్యాంక్ అకౌంట్ ఐడీ, పాస్వర్డ్, సీవీవీ నెంబర్, మొబైల్ నెంబర్లు వంటి సమాచారం మొత్తం వారికి చేరవేస్తుంది.