Best investment plans: రాబడిని రెట్టింపు చేసుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ కొందరే ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు. మరికొందరు పలు అనుమానాలతో రిస్క్ చేయడానికి ఇష్టపడరు. ఎందులో పెట్టుబడి పెట్టాలి? ఎలా పెట్టాలి? నష్టపోతామా? అని ఆలోచిస్తారు. ఇంతకూ ఎందులో పెట్టుబడి పెడితే లాభాలు అధికంగా వస్తాయో? నిపుణులు అభిప్రాయాలేంటో తెలుసుకుందాం
నేను నెలకు రూ.10వేల వరకూ పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. కనీస వార్షిక రాబడి 14 శాతం మించి రావాలంటే ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? ఎంత కాలం మదుపు చేయాలి?
- అరుణ్
*అధిక రాబడి రావాలంటే నష్టభయంతో కూడిన పెట్టుబడులతోనే సాధ్యం. మీరు ఎంత మేరకు నష్టభయం భరించగలరు అనేది చూసుకోండి. ఈక్విటీ ఆధారిత పెట్టుబడులతో కొన్ని సందర్భాల్లో 14శాతానికి మించి రాబడి వచ్చింది. అయితే, కనీసం 7-10 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించినప్పుడే ఇది సాధ్యం. స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటాయని మర్చిపోవద్దు. క్రమానుగతంగా మదుపు కొనసాగిస్తూ ఉంటే.. దీర్ఘకాలంలో 12-15 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. దీనికి మీరు మంచి పనితీరున్న డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను పరిశీలించండి.
మా అమ్మ పేరుమీద సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ఖాతాలో రూ.5లక్షలు జమ చేయాలని అనుకుంటున్నాం. దీనివల్ల ఎక్కువ లాభమా? డెట్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేసి, నెలకు కొంత మొత్తం తీసుకుంటే మంచిదా?
- స్వప్న
*సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంపై 7.4శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. వడ్డీని ప్రతి మూడు నెలలకోసారి చెల్లిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్లలో ఇంతకన్నా అధిక రాబడి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి, సీనియర్ సిటిజన్ ఖాతాలోనే జమ చేయండి. ఈ పథకంలో అయిదేళ్లపాటు కొనసాగాలి. పెట్టిన పెట్టుబడికి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. వచ్చిన వడ్డీని మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే శ్లాబుల ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.