తెలంగాణ

telangana

ETV Bharat / business

'మీ వ్యాపార సంస్థల పర్యవేక్షణ మేం చూస్తాం'

దుకాణాల్లో ఒక వస్తువును కనిపించకుండా ఎవరైనా దుస్తుల్లో దాచుకొని, దొంగిలిస్తే దాన్ని ఆ సమయంలో కనిపెట్టడం కష్టం. సీసీటీవీ కెమెరాలు ఉన్నా.. ఆ మొత్తం ఫుటేజీని పరిశీలించాలి. లేదంటే ఇలాంటి దొంగతనాలను గుర్తించేందుకు సీసీటీవీల పరిశీలనకు ఒక ఉద్యోగిని నియమించాల్సి ఉంటుంది. ఇది వ్యయం, శ్రమతో కూడుకున్నది. ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకే 'అవర్‌ఐ.ఏఐ' అంకురం పుట్టుకొచ్చింది.

By

Published : Jul 18, 2021, 7:16 AM IST

our eye
అంకురం అవర్‌ఐ

హోటళ్లు, రెస్టారెంట్లలో వంట గది పరిశుభ్రత చాలా ముఖ్యం. వంటగదిని శుభ్రం చేస్తున్నారా? చెఫ్‌లు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? దుకాణానికి ఏ సమయంలో ఎక్కువ వినియోగదారులు వస్తున్నారు? ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడమూ కష్టమైన పనే. ఇలాంటి సమస్యలన్నింటికీ సులువుగా పరిష్కారం చూపిస్తామంటున్నారు.. 'అవర్‌ఐ.ఏఐ' అంకుర వ్యవస్థాపకులు మీరాన్‌ జునైదీ, సౌరవ్‌ సన్యాల్‌, సౌరబ్‌ ఘనేకర్‌, అజయ్‌.

ఎస్‌ఆర్‌ఎం, అమరావతిలో చదువుకునే సమయంలో ఒక సెమిస్టర్‌ కోసం కాలిఫోర్నియా, విశ్వవిద్యాలయం, బర్క్‌లీకి వెళ్లాం. అక్కడ ఉన్న సమయంలో ఫోన్‌ పోయింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. వారు మొత్తం ఫుటేజ్‌ను పరిశీలించాల్సిందిగా మాకు చెప్పారు. అది కష్టమైన పని అని అర్థమైంది. సీసీ కెమేరాలను ఏర్పాటు చేసినా వాటి ఫుటేజీలను పరిశీలించడం అంత సులువు కాదు. ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకే 'అవర్‌ఐ.ఏఐ'ను స్థాపించాం. బర్క్‌లీలో జరిగిన హ్యాకథాన్‌లోనూ ఈ ప్రాజెక్టుకు బహుమతి లభించింది. దీంతో దీన్నే వ్యాపారంగా ప్రారంభించాం. సీసీ కెమేరాలకు కృత్రిమ మేధ, డీప్‌ లెర్నింగ్‌ సాంకేతికతను వినియోగించి, దీన్ని రూపొందించాం.

ఇలా పని చేస్తాయి..

ప్రస్తుతం ఆహారశాలలు, రిటైల్‌ దుకాణాలు, పని ప్రదేశాల్లో ఈ సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నాం. దుకాణంలో ఎవరైనా వస్తువు కనిపించకుండా దుస్తుల్లో దాచుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తే కెమేరాలు వెంటనే గుర్తించి, యజమానికి సమాచారం అందిస్తాయి. ఒకవేళ వారు బిల్‌ కట్టకపోతే వెంటనే పట్టుకోవచ్చు. విదేశాల్లో కొన్ని రిటైల్‌ దుకాణాల్లో ఇలాంటి దొంగతనాలు ఎక్కువే. మన దేశంలోనూ పెద్దపెద్ద రిటైల్‌ స్టోర్లలో జరుగుతూ ఉంటాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో వంటగదుల శుభ్రత చాలా ముఖ్యం. వంటగదిని ఎన్ని సార్లు శుభ్రం చేశారు? చెఫ్‌లు, సిబ్బంది నిబంధనలకు అనుగుణంగా గ్లౌజ్‌లు, మాస్కులు తదితరాలను ధరిస్తున్నారా? శాకాహారం, మాంసాహారం వంటలకు వేర్వేరు పాత్రలు వినియోగిస్తున్నారా? ఇలాంటి వాటిని కెమేరాలు పరిశీలిస్తాయి. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే వెంటనే యజమానికి సమాచారం వెళ్తుంది. హోటల్‌కు ఏ సమయంలో ఎక్కువ మంది వినియోగదారులు వస్తున్నారు? ఏ వయసు వారు? వారు బిల్లింగ్‌ కోసం ఎంత సమయం వేచి చూడాల్సి వస్తోంది? ఆహార పదార్థాన్ని తిన్నప్పుడు సంతృప్తి వ్యక్తం చేశారా? లేదా? అనే విశ్లేషణ వ్యాపార సంస్థ యజమానికి అందుతుంది. ప్రస్తుత కరోనా సమయంలో మాస్కులు ధరించని వారినీ ఇది అప్రమత్తం చేస్తుంది.

రూ.10 లక్షలతో ప్రారంభం..

'అవర్‌ఐ.ఏఐ'ను రూ.10 లక్షలతో ప్రారంభించాం. ఆ తర్వాత పెట్టుబడి కోసం ముంబయిలోని '100ఎక్స్‌.వీసీ'ని సంప్రదించాం. మా ఆలోచనను వివరించడంతో రూ.25లక్షలు పెట్టారు. గత జనవరి నుంచి బెంగళూరు కేంద్రంగా పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. ఇటీవలే మరో రూ.70 లక్షల పెట్టుబడి సమీకరించాం. ప్రస్తుతం రూ.1.05 కోట్లతో వ్యాపారం కొనసాగిస్తున్నాం. రిటైల్‌ దుకాణాలు, హోటళ్లు, పని ప్రదేశాలే కాకుండా ఉత్పత్తి రంగానికి వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తున్నాం.

నలుగురితో మొదలై

మొదట నలుగురితో మొదలైన సంస్థలో ఇప్పుడు 20 మంది ఉద్యోగులున్నారు. కొవిడ్‌-19 నిబంధనల అమలు తెలుసుకునేందుకు చాలా మంది మా సేవలను వినియోగించుకుంటున్నారు. నెలకు రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తోంది. అమెరికాలో 20, మన దేశంలో 250 సంస్థలకు అవర్‌ఐ.ఏఐ తన సేవలను అందిస్తోంది. ఈ ఏడాది డిసెంబరు నాటికి నెలకు రూ.25 లక్షల ఆదాయం సాధించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details