టర్మ్ పాలసీ గురించి చాలా మందికి అవగాహన ఉంది. అయితే ఇందులో బీమా మొత్తం మారదు. ఖర్చులు పెరిగి, కుటుంబం విస్తరిస్తే గతంలో చేయించిన ఈ బీమా సరిపోకపోవచ్చు. ఈ సమస్య లేకుండా ఉండేవే ఇంక్రిమెంటల్ టర్మ్ పాలసీలు. వాటి గురించి తెలుసుకుందాం..
ఆర్థిక భద్రతలో టర్మ్ పాలసీ ముఖ్యమైనదిగా భావిస్తారు. తమపై ఆధారపడిన వారి భవిష్యత్తును సురక్షితం చేసేందుకు దీనిని కొనుగోలు చేయటం చాలా ఉత్తమమైన పని. బీమా చేయించుకున్న వ్యక్తి మరణించిన పక్షంలో.. నామినీ బీమా మొత్తాన్ని పొందుతారు.
బీమా కొనుగోలు చేస్తున్నప్పుడు ఎంత మొత్తం కవరేజీ తీసుకోవాలన్న విషయంలో చాలా మంది సందిగ్ధపడుతుంటారు. వార్షిక ఆదాయానికి 7 నుంచి 10 రెట్లు కవరేజీ తీసుకోవాలని వ్యక్తిగత ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. అయితే ఆదాయం పెరిగిన కొద్ది.. కవరేజీ పెంచుకునే ఆప్షన్ తీసుకోవాలని వారు చెబుతున్నారు.
క్రమక్రమంగా పెరుగుతుంది
ఇంక్రిమెంటల్ ఆప్షన్ ద్వారా ప్రతి సంవత్సరం బీమా కవరేజీ క్రమక్రమంగా పెరుగుతుంది. దీన్ని బట్టి ప్రీమియం మొత్తం కూడా పెరుగుతుంది. అయితే సాధారణ టర్మ్ పాలసీలో ప్రీమియం మారదు.