అనుకున్న లక్ష్యాల బాటలో పయనించకుండా.. మహమ్మారి ఎంతోమందిపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. భవిష్యత్ అవసరాల కోసం ఎంత మొత్తం దాచుకున్నా.. ఒక్కసారి అదంతా తుడిచిపెట్టుకుపోయిన సందర్భాలు ఈ రెండేళ్ల కాలంలో ఎన్నో చూశాం. రానున్న రోజుల్లో మళ్లీ ఇలాంటి మహమ్మారులు దాడి చేసినా.. ఎంతోకొంత ఆర్థిక భరోసా మనకు ఉండాల్సిందే. అందుకే, సంపాదన, పెట్టుబడులు.. పొదుపులాంటి వాటితోపాటు.. బీమా పాలసీలూ ఒక రకంగా మనకు ఆర్థిక రక్షణనిచ్చేవే.
చిన్న మొత్తంతోనే..
కరోనా తర్వాత ప్రధానంగా మనం గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యపరమైనది. ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకి, పరిస్థితి విషమిస్తే.. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లినప్పుడు అప్పటి వరకూ అతను దాచుకున్న అత్యవసర నిధి, పొదుపు, పెట్టుబడులన్నీ ఆ వైద్య బిల్లులు చెల్లించేందుకే ఖర్చు అయిపోయాయి. కొంతమంది అధిక వడ్డీకి వ్యక్తిగత రుణాలను సైతం తీసుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ఆర్థిక రక్షణ కల్పించాలంటే మంచి ఆరోగ్య బీమా పాలసీ ఉండాల్సిందే. ఆసుపత్రి బిల్లుల ఖర్చులతో పోలిస్తే తక్కువ మొత్తంతో లభించే ఆరోగ్య బీమా పాలసీలు ఆర్థిక స్వేచ్ఛలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు.
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు అయ్యే ఖర్చును ఆరోగ్య బీమా భరిస్తుంది. దీనివల్ల కుటుంబ అవసరాల కోసం దాచిన డబ్బును తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి, ఆర్థిక లక్ష్యాల సాధనలో ఇబ్బందులు ఎదురవ్వవు. దీంతోపాటు ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం-1961, సెక్షన్ 80డీ ప్రకారం మినహాయింపూ వర్తిస్తుంది.