కొవిషీల్డ్ టీకా ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు సీరమ్ సంస్థ త్వరితగతిన చర్యలు తీసుకొంటోంది. ప్రభుత్వం ప్రకటించిన రూ.3,000 కోట్ల రుణం చేతికి వచ్చేలోపు.. బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి ఉత్పత్తిని వేగవంతం చేస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా తెలిపారు. మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ టీకా వేయించుకొనేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. జులై నాటికి నెలకు 10 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీరంకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3వేల కోట్లు త్వరలోనే వస్తాయని నమ్ముతున్నానని అదార్ పునావాలా పేర్కొన్నారు. ఆ మొత్తం వచ్చే వరకు వేచి ఉండకుండా.. బ్యాంకుల నుంచి రుణాల రూపంలో సొమ్మును సేకరించి ఉత్పత్తిని వేగవంతం చేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి ఆ నిధులు ఈ వారంలో రావచ్చని భావిస్తున్నట్లు ఆయన ఆంగ్లవార్త సంస్థ ఎన్‌డీటీవీతో తెలిపారు. జులై చివరికి వరకు ప్రభుత్వం 'వ్యాక్సిన్ మైత్రి'నిలిపేయవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎగుమతులపై దృష్టిపెట్టే అవకాశం లేదని ఆయన వివరించారు. జూన్-జులైలో ఎగుమతులు పునరుద్ధరించవచ్చన్నారు.