తెలంగాణ

telangana

ETV Bharat / business

తస్మాత్​ జాగ్రత్త.. హైదరాబాద్​పై సైబర్ దాడులకు కుట్ర! - హైదరబాద్​లపై సైబర్​ దాడులు

భారత్​పై అనేక విదేశీ హ్యాకర్లు సైబర్​ దాడులకు పాల్పడొచ్చని పలు ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఆర్థికంగా దెబ్బతీయడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని ఆయా సంస్థలు చెబుతున్నాయి. హైదరాబాద్​ సహా పలు ప్రధాన నగరాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సైబర్​దాడులను తప్పించుకునేందుకు నిపుణులు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. అవేమిటో మీరు తెలుసుకొని జాగ్రత్త వహించండి.

cyber attacks in India
భారత్​పై సైబర్​దాడులకు కుట్ర

By

Published : Jun 28, 2020, 7:08 PM IST

కరోనా నేపథ్యంలో ఇటీవల ఇంటర్నెట్​ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చాలా మంది ఇళ్లకే పరిమితమైన నేపథ్యంలో ఆన్​లైన్​ ద్వారానే అన్ని అవసరాలు తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా కరోనాకు ముందు నగదు ద్వారానే లావాదేవీలు జరిపిన వారు కూడా.. ఆన్​లైన్​కు మారారు. అయితే దీన్ని అదనుగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భారీ ఎత్తున మాల్వేర్​లతో దాడులకు పాల్పడొచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హెచ్చరిక..

ఇండియన్ కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) కూడా భారీగా సైబర్​ దాడులు జరగొచ్చని ఇటీవల హెచ్చరించింది. ఫిషింగ్ ఎటాక్ రూపంలో ఈ దాడి ఉంటుందని తెలిపింది.

ఈ నేపథ్యంలో సురక్షితంగా డిజిటల్ పద్ధతిలో లావాదేవీలు చేయటంపై రిజర్వు బ్యాంకు కూడా మార్గదర్శకాలు విడుదల చేసింది. బ్యాంకులు కూడా వినియోగాదారులను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ తరచూ సందేశాలను పంపిస్తున్నాయి.

సింగపూర్​కు చెందిన సైఫార్మా అనే సంస్థ కూడా భారతదేశంలో ఫిషింగ్ ఎటాక్ జరగవచ్చని తెలిపింది. ఉత్తర కొరియాకు చెందిన లాజరస్ అనే హ్యాకర్స్ గ్రూప్... భారతదేశంతో సహా ఆరు దేశాలపై ఈ దాడులు చేయనుందని ఈ సంస్థ నివేదిక పేర్కొంది.

హ్యాకర్ల చేతిలో 20 లక్షల ఈ మెయిళ్లు..

సాధారణ ఈ-మెయిల్ లానే ఉండి దాన్ని క్లిక్ చేస్తే వేరే సైట్ తెరుచుకుని మీ వివరాలు సేకరించేందుకు ఉపయోగపడే వాటిని ఫిషింగ్​ మెయిల్స్ అంటారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేందుకు వచ్చినట్లు, ఇతర సంస్థల నుంచి పంపినట్లు ఈ మెయిల్​లు భారతీయులకు పంపేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు సైఫార్మా తెలిపింది.

సైఫార్మా తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 20 లక్షలకుపైగా భారతీయుల ఈ మెయిళ్లు హ్యాకర్ల చేతిలో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్, దిల్లీ, ముంబయి, చెన్నై, అహ్మదాబాద్ నగరాలపై సైబర్​దాడుల ప్రమాదం ఎక్కువగా ఉంది.

ఫిషింగ్​ మెయిళ్లను గుర్తించండిలా..

  • ఎవరికైనా ఈ మెయిల్​ వస్తే అది ఫిషింగ్ మెయిలా? లేదా నిజమైనదేనా అనే కొన్ని జాగ్రత్తల ద్వారా తెలుసుకునే వీలుంది.
  • కంపెనీలు లేదా ప్రభుత్వం ఏదైనా ఈ మెయిల్ పంపితే వాటి ద్వారా ఎలాంటి సున్నితమైన సమాచారాన్ని అవి కోరవు.
  • కంపెనీలు తమ డొమైన్ పేరు మీద ఉన్న మెయిల్ అడ్రసు నుంచి మాత్రమే మెయిల్ పంపిస్తాయి. ఇవి దాదాపు వినియోగదారుడి పేరుతోనే సంబోధిస్తాయి. అడ్రస్​లో హెచ్‌టీటీపీఎస్ అని ఉంటుంది. వీటికి వ్యతిరేకంగా ఉన్నట్లైతే అది ఫిషింగ్ మెయిల్ అవ్వొచ్చు.
  • మెయిల్ అడ్రస్, వెబ్ సైట్ అడ్రస్​ను జాగ్రత్తగా పరిశీలించండి. ఒక్క అక్షరం తేడా ఉన్న అది ఫిషింగ్ మెయిలే అని నిర్ధరించుకోండి.
  • కొన్ని ఫైల్స్ ద్వారా వైరస్​ మన కంప్యూటర్‌లో ప్రవేశించే ప్రమాదం ఉంది. జిప్, ఈఎక్స్‌ఈ, ఎస్‌సీఆర్‌ లాంటి ఎక్స్‌టెన్షన్ ఉన్న అటాచ్‌మెంట్లలో వైరస్ ఉండేందుకు ఉండే అవకాశాలు ఉంటాయి. వాటి పట్ల జాగ్రత్త వహించండి.

ఫిషింగ్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ఈ మెయిల్ తెలిసిన ఆధారాల నుంచి వచ్చినట్లు అనిపించినా.. వాటిలో అటాచ్ అయ్యి వచ్చిన ఫైళ్లను ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. తెలిసిన వ్యక్తులు, సంస్థల నుంచి ఒకవేళ మీరు అడగకుండానే ఏదైనా మెయిల్ వస్తే.. వాటి అటాచ్​మెంట్ల పట్ల కూడా జాగ్రత్త వహించండి. ఇలాంటి వాటిలో లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు.
  • కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితులను సైబర్ దాడులకు ఉపయోగించే అవకాశం ఉంది. ఇంటి నుంచి పనిచేస్తున్న బీమా ఏజెంట్లు, బ్యాంకు ప్రతినిధులమని చెప్పుకునే వారి నుంచి వచ్చే ఫోన్లను పట్టించుకోకపోవటమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
  • ఆన్​లైన్ నగదు బదిలీలు, కొనుగోళ్లకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. చెల్లించే అకౌంట్ నంబర్ సరైనదా కాదా అనేది చెక్ చేసుకోవాలి.
  • ఆన్​లైన్ కొనుగోళ్లు నమ్మదగిన సైట్ల నుంచి మాత్రమే చేయండి.
  • యూజర్ ఐడీ, పాస్ వర్డ్‌ల వంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరికీ చెప్పొద్దు. కంపెనీ ప్రతినిధులమని చెప్పుకునే వారికి, వివిధ వెబ్ సైట్లకు కానీ ఈ వివరాలను తెలియజేయవద్దు.
  • చూసేందుకు నిజమే అనిపించే ఆఫర్లను ఒకటికి రెండు సార్లు తనిఖీ చేసుకొండి. అనుమానం ఉన్న వాటిని సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్లండి.

ఇదీ చూడండి:అంతరిక్ష రంగంపై అంకురాల ఆసక్తి

ABOUT THE AUTHOR

...view details