డేటా ప్రైవసీ కారణాలతో గత ఏడాది నిషేధానికి గురైన పబ్జీ.. భారత్ మార్కెట్లోకి తిరిగి వచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీనితో అదే గేమ్‌కు స్వల్ప మార్పులు చేసి.. 'బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా' పేరుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈ గేమ్ అందుబాటులోకి రాకున్నా ముందస్తు యాక్సెస్ ద్వారా ఇప్పటికే దీనిని చాలా మంది వినియోగిస్తున్నారు. మొదటి రోజే 50 లక్షల డౌన్లోడ్లు సాధించడం గమనార్హం.
అవే చిక్కులు..
ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ యాప్‌కు ఆదిలోనే పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకున్న యూజర్ల డేటాను ప్రస్తుతం భారత్, సింగపూర్‌లో స్టోర్ చేస్తున్నట్లు కంపెనీ ఇది వరకే వెల్లడించింది. అయితే ఈ డేటాను చైనా, హాంకాంగ్, అమెరికా, రష్యాలోని సర్వర్లకూ చేరుతున్నట్లు గేమ్ గురించి అధ్యయనం చేసిన ఓ సంస్థ ఆరోపించింది.
ఈ గేమ్‌ను భారత్‌లో విడుదల చేసే ముందు.. చైనాతో అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు 'బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా' మాతృ సంస్థ క్రాఫ్టన్ వెల్లడించింది. గేమ్ ప్రైవసీ పాలసీ పేజీలో.. 'న్యాయపరమై అవసరాలకు, గేమ్ నిర్వహణ వంటి అవసరాల కోసం.. మీ డేటాను ఇతర దేశాలకు తరలించొచ్చు.' అని పేర్కొంది. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని భారత్, సింగపూర్‌లో ఉన్న సర్వర్లలో నిక్షిప్తం చేయనున్నట్లు కూడా తెలిపింది. ఒకవేళ వేరే దేశానికి బదిలీ చేయాల్సి వస్తే.. భారత్‌లో ఉన్నట్లుగానే అక్కడ కూడా మీ డేటాకు పూర్తి భద్రత ఉంటుందని హామీ ఇచ్చింది.