లాక్‌డౌన్ నేపథ్యంలో 'పీఎం గరీబ్ కల్యాణ్' ప్యాకేజీ కింద జన్‌ధన్ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్‌కు సంబంధించిన రూ.500 నగదును బదిలీ చేయాలని బ్యాంకర్లను కేంద్రం ఆదేశించింది. ఈ నెల 3-9 తేదీల మధ్య ఆయా ఖాతాల్లో డబ్బులు వేయనున్నారు. అయితే, బ్యాంకుల్లో మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి వచ్చే ప్రజలూ సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశంతో కొత్త విధానం అవలంబిస్తున్నారు. జన్‌ధన్ ఖాతాలు కలిగిన వారు.. వారి ఖాతాల నంబర్ ఆధారంగా ఆయా తేదీల్లో మొత్తాలను విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
'జన్‌ధన్' నగదు ఉపసంహరణ ఆ కొద్ది రోజులే!
పీఎం గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద జన్‌ధన్ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్ నెలకు చెందిన నగదును బదిలీ చేయాలని బ్యాంకర్లను ఆదేశించింది కేంద్రం. ఈ నెల 3-9 తేదీల మధ్య వారి ఖాతాల్లో 500 రూపాయలను వేయనున్నారు అధికారులు.
0-1 నంబర్‌తో ముగిసే ఖాతాదారులు మూడో తేదీ ఆ మొత్తాన్ని ఖాతా నుంచి తీసుకోవచ్చు. 2-3 నంబర్‌తో ముగిసే ఖాతాదారులు 4వ తేదీ, 4-5 నంబర్ గలవారు ఏడో తేదీ, 6-7 నంబర్ గలవారు 8వ తేదీ, 8-9 నంబర్ గలవారు 9వ తేదీన తమ నగదును ఉపసంహరించుకోవచ్చు. 9వ తేదీ తర్వాత ఎవరైనా తమ ఖాతాల్లో నగదును తీసుకోవచ్చని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది. కేవైసీ పత్రాలు లేవన్న కారణంతో చిన్న ఖాతాలను స్తంభింపజేయవద్దని, వాటిని వెంటనే వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. కాబట్టి జన్‌ధన్ ఖాతా తెరిచిన ప్రతి మహిళా అకౌంట్‌లోనూ రూ.500 చొప్పున నగదు జమ కానుంది. మూడు విడతలుగా ఈ మొత్తం వేయనున్నారు.