కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ముందుకొచ్చాయి. ఆసుపత్రుల్లో చికిత్సపొందుతూ.. బిల్లుల కట్టలేని వారికి ఎటువంటి పూచీకత్తు లేకుండా అన్నీ ప్రభుత్వం రంగ బ్యాంక్‌లు రూ. 5 లక్షల వరకు రుణంగా ఇవ్వనున్నాయి.
కొవిడ్ రెండో దశలో వినియోగదారులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)లు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. కొవిడ్ చికిత్సకు సంబంధించి రూ.25వేల నుంచి రూ.5లక్షల వరకు వ్యక్తిగత రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపాయి. ఈ నిర్ణయం పెన్షనర్లు, శాలరీ, నాన్-శాలరీ అకౌంట్ ఉన్నవారికి కూడా వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఈ రుణాలపై వడ్డీ సాధారణం కంటే తక్కువ ఉంటుందని వివరించాయి. వీటి కోసం బ్యాంక్‌లు ప్రత్యేకించి కొవిడ్ లోన్ బుక్‌ను ఏర్పాటు చేయాలని కోరాయి.