జనవరి 1 నుంచి ఎమ్డీఆర్ చెల్లింపులు ఉండవ్! ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు కీలక సూచనలు చేశారు. అధికార దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్యాంకు అధికారులపై పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. దీనిపై బ్యాంకులు ఓ నిర్ణయానికి వచ్చేంత వరకు సీబీఐ దర్యాప్తు ఉండబోదని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు.
మందగమనంలో ఉన్న దేశ ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ఉద్దీపన చర్యలపై సమీక్షే ప్రధాన అజెండాగా... నిర్మలా సీతారామన్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల అధిపతులతో భేటీ అయ్యారు.
ఎమ్డీఆర్ ఉండదు..
జనవరి 1 నుంచి ఎంపిక చేసిన చెల్లింపు పద్ధతులపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎమ్డీఆర్) ఛార్జీలు వర్తించవని ఆర్థికమంత్రి స్పష్టం చేశారు. అవి ఏయే రకాల చెల్లింపులు అనే అంశాన్ని... ప్రభుత్వ రంగ బ్యాంకులతో మరోసారి భేటీయై నిర్ణయిస్తామని వెల్లడించారు.
"రూ.50 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు తమ వినియోగదారులకు తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ చెల్లింపు సౌకర్యం కలిగించాలని నేను ప్రతిపాదించాను. వినియోగదారులతో పాటు వ్యాపారులపైనా ఎటువంచి ఛార్జీలు లేదా ఎమ్డీఆర్ రేటు విధించం. ఆర్బీఐ, బ్యాంకులు నగదు చెల్లింపులు నిరాశపర్చడం వల్ల ప్రజలు డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గుతారు."- నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి
జులైలో తన బడ్జెట్ ప్రసంగంలో, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఎమ్డీఆర్ ఛార్జీలను మాఫీ చేయాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: కేంద్రం చర్యలున్నా.. ఇంకా తగ్గని ఉల్లి ఘాటు!