పండుగ సీజన్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంకులు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. హోం లోన్స్, వాహన రుణంపై వడ్డీ రాయితీ ఇస్తున్నాయి. ఇప్పటి వరకు వివిధ బ్యాంకులు ప్రకటించిన లోన్ ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్బీఐ
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ అన్నింటికన్నా ముందుగా పండుగ సీజన్ ఆఫర్లు (SBI offers) ప్రకటించింది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇచ్చే హోం లోన్స్ (SBI Home loan) వడ్డీ రేటును 45 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
ఇంతకు ముందు రూ.75 లక్షల వరకు హోం లోన్‌పై (SBI home loan Interest rate) 7.15 శాతం వడ్డీ వసూలు చేసేది ఎస్బీఐ. ఇకపై రుణ మొత్తంతో సంబంధం లేకుండా.. వడ్డీ రేటు 6.70గా ఉంటుందని వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల 30 ఏళ్ల కాల పరిమితితో.. రూ.75 లక్షల రుణం తీసుకుంటే రూ.8 లక్షల వరకు వడ్డీ భారం తగ్గనుందని తెలిపింది.
ఉద్యోగులతో పోలిస్తే.. ఉద్యోగేతరులకు మధ్య ఉన్న 15 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు అంతరాన్ని కూడా తొలగించింది ఎస్బీఐ.
పీఎన్బీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా పండుగ సీజన్ ఆఫర్ (PNB offers) కింద.. రూ.50 లక్షలకుపైగా హోం లోన్ (PNB home loan offers) తీసుకుంటే.. 0.50 శాతం వడ్డీ రేటు తగ్గిస్తున్నట్లు తెలిపింది. దీనితో వడ్డీ రేటు 6.60 శాతానికి (PNB Home loan interest rate) దిగిరానుందని, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రేట్లలో ఇదే అత్యల్పమని పీఎన్బీ పేర్కొంది.
క్రెడిట్ స్కోరు అనుసంధానిత రుణాలపై ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది పీఎన్బీ. ఇప్పటికే.. హోం లోన్స్, వాహన రుణం, పర్సనల్ లోన్స్, పెన్షన్ లోన్స్, ప్రాపర్టీ, గోల్డ్ లోన్స్‌పై 'ఫెస్టివల్ బొనాంజా ఆఫర్' కింద ప్రాసెసింగ్, సర్వీస్ ఛార్జీలను రద్దు చేసినట్లు వివరించింది.