దేశంలో అందరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన మరో రికార్డు నెలకొల్పింది. దేశవ్యాప్తంగా జన్ ధన్ బ్యాంకు ఖాతాల సంఖ్య 40.05 కోట్ల మైలురాయిని దాటింది. జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు కూడా రూ.1.30 లక్షల కోట్ల మార్క్ అధిగమించినట్లు కేంద్ర ఆర్థిక సేవల విభాగం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
జన్ ధన్ యోజన ప్రారంభించి త్వరలోనే ఆరేళ్లు పూర్తవనుంది. ఆలోపే ఖాతాల సంఖ్య 40 కోట్ల మైలురాయిని దాటడం గమనార్హం. 2014 ఆగస్టు 28న ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్రం.