చైనాలో కొవిడ్-19 తొలి కేసు నమోదు కాకముందు ఏ రోజు చూసినా ప్రపంచ గగనతలంలో సుమారు 20 వేలకు తగ్గకుండా పౌర విమానాలు ఎగురుతూ ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. మనదేశంలోనూ దాదాపు 600 విమానాలు నిలిచిపోయినా, ప్రస్తుతం మూడోవంతు కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షల వల్ల రెండున్నర నెలల పాటు తీవ్రంగా నష్టపోయిన విమానయాన సంస్థలు, జవసత్వాలు కూడదీసుకునే ప్రయత్నం చేస్తున్నా... పరిస్థితి వెంటనే మారేలా లేదు. అయితే ఫిబ్రవరి నాటి ధరలతో పోలిస్తే, విమాన ఇంధన (ఏటీఎఫ్) ధర ఇప్పుడు సగం మేర ఉండటమే విమానయాన సంస్థలకు ప్రధాన ఊరట కల్పించే అంశం. విమానాల నిర్వహణ వ్యయంలో ఇంధన వాటాయే 40 శాతం కావడం గమనార్హం. ఏ సంస్థ నిర్వహించే విమానాలు అయినా, లీజుకు తీసుకున్నవే అధికం.
ఇందుకు దేశీయ సంస్థలైతే కనీసం రూ. 2కోట్లు-రూ.4 కోట్లు నెలవారీ చెల్లించాల్సిందే. వీటిపై లీజింగ్ సంస్థలు, విమానయాన సంస్థలు సంప్రదింపులు చేసుకుని ఒక నిర్ణయానికి రావాల్సి ఉంది. దాదాపు రెండున్నర నెలలుగా వాటిని ఉపయోగించకున్నా అద్దె మాత్రం డాలర్లలో చెల్లించాల్సిందే. ఈ రెండు నెలల్లో రూపాయి కొంత బలహీన పడటం దేశీయ సంస్థలకు అదనపు భారమైంది. విమానాలు నిలిపి ఉంచినందుకు విమానాశ్రయాలకు చెల్లించాల్సిన ఛార్జీలు (కనీసం రోజుకు రూ.25వేలు-రూ.50వేలు), నిర్వహణ వ్యయాలు వంటి అంశాల్లో ప్రభుత్వాలు సహకరిస్తే, ఈ రంగం త్వరగా కోలుకునే వీలుంది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఏసీ రైలులో 36-48 గంటలు ప్రయాణించే దూరాన్ని 3-4 గంటల్లో చేరగలగడంతో పాటు విమానాశ్రయాల్లోనూ, విమానాల్లోనూ వైరస్ వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుండడంతో దూర ప్రయాణాలకు విమానాలను ఆశ్రయిస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి.
నష్టాల ఫలితంగా వేతన కోతలు
అంతర్జాతీయ వాణిజ్యం, పర్యాటకం, ఆతిథ్యం, క్రీడలు, వినోదం... ఇవన్నీ విమానయానంతో ముడిపడిన రంగాలు. లాక్‌డౌన్ ఫలితంగా ఇవన్నీ స్తంభించాయి. రాకపోకలు లేక విమానయాన సంస్థలు దివాలా అంచుకు చేరిన స్థితి అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ... ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. భారత విమానయాన పరిశ్రమకు సైతం రూ.25,000 కోట్ల మేరకు ఆదాయ నష్టం ఉంటుందని ఇటీవల ‘క్రిసిల్’ ఒక నివేదిక పేర్కొంది. దేశీయ అగ్రగామి సంస్థ ఇండిగో 2019-20 నాలుగో త్రైమాసికానికి రూ.870 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. స్పైస్‌జెట్, ఎయిర్ ఏషియా, విస్తారా, గో ఎయిర్... తదితర సంస్థలన్నీ నష్టాలు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఆయా సంస్థలన్నీ ఉద్యోగాలు, జీతభత్యాల్లో కోత వంటి చర్యలను చేపట్టాయి.