తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఫాస్టాగ్‌ ద్వారా రోజుకు రూ.100 కోట్ల వసూళ్లు' - fastag collection crosses rs100 crore mark

ఫాస్టాగ్​ ద్వారా దేశవ్యాప్తంగా రోజుకు రూ.100 కోట్లు వసూలవుతున్నట్లు కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది. ఈ విధానంలో చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపింది.

average daily fastag collection crosses rs100 crore mark
ఫాస్టాగ్‌ ద్వారా నిత్యం రూ.100 కోట్ల వసూళ్లు!

By

Published : Mar 22, 2021, 10:49 PM IST

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్‌గేట్ల నుంచి వసూలు చేస్తోన్న రుసుము రోజువారీగా సరాసరి రూ.100కోట్ల మార్కును దాటింది. ఫాస్టాగ్‌ ద్వారా చేస్తోన్న చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

"మార్చి 16 నాటికి 3 కోట్లకు పైగా ఫాస్టాగ్‌లను జారీ చేశాము. వీటి ద్వారా మార్చి ఒకటో తేదీ నుంచి 16వ తేదీ వరకు నిత్యం సరాసరి వంద కోట్ల రూపాయలు వసూలు అవుతోంది" అని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు. టోల్‌ప్లాజాల వద్ద ఆలస్యం లేకుండా, సులువుగా రుసుము చెల్లింపులు చేసేందుకు డిజిటల్‌ పద్ధతి ఎంతో దోహదం చేస్తోందని, దీంతో వాహనాలు వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గిందని స్పష్టం చేశారు.

కాలుష్యాన్ని తగ్గించడం సహా టోల్‌ చెల్లింపుల్లో పారదర్శకత పెరిగేందుకు ఈ విధానాన్ని తీసుకువచ్చామని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

త్వరలోనే నూతన విధానం..

ఇక, ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్‌ప్లాజాలను పూర్తిగా తొలగిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ మధ్యే వెల్లడించారు. వీటి స్థానంలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వసూళ్ల వ్యవస్థను తీసుకొస్తామని పేర్కొన్నారు. జీపీఎప్‌ ఆధారంగా..వాహన కదలికలను బట్టి వినియోగదారు బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్‌ మొత్తాన్ని మినహాయించుకొనే కొత్త వ్యవస్థను తీసుసువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నూతన విధానం అమల్లోకి వస్తే.. వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికే టోల్‌ ఛార్జీలు పడతాయని అభిప్రాయపడ్డారు.

ఫిబ్రవరి 15వ తేదీ నుంచి దేశంలోని అన్ని టోల్‌గేట్‌ల వద్ద ఫాస్టాగ్‌ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఫాస్టాగ్‌ లేని వాహనాల నుంచి రెట్టింపు రుసుమును వసూలు చేస్తున్నారు.

రైతుల ఆందోళన.. రూ.814 కోట్ల నష్టం

రైతుల ఆందోళన కారణంగా నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)కు రూ.814.4 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల పరిధిలో టోల్‌ప్లాజాల వద్ద చెల్లింపులు నిలిచిపోవడం వల్ల ఈ నష్టం జరిగిందని చెప్పారు. పంజాబ్‌లో రూ.487 కోట్లు, హరియాణాలో రూ.326 కోట్లు, రాజస్థాన్‌లో రూ.1.40 కోట్లు చొప్పున నష్టం వాటిల్లిందని, ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నష్టమూ జరగలేదని చెప్పారు. టోల్‌ చెల్లింపులు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆయా రాష్ట్రాల అధికారులకు సూచించామని గడ్కరీ వివరించారు.

ఇదీ చూడండి:'ఇకపై ఫాస్టాగ్​లో కనీస నగదు నిల్వ అవసరం లేదు'

ABOUT THE AUTHOR

...view details