పరిశ్రమలన్నీ ఆటోమేషన్‌కు (యాంత్రీకరణ) మారిపోతున్న తరుణంలో టెక్నాలజీ రంగంలో ఉన్న దేశీయ సాఫ్ట్‌వేర్ సంస్థలు కూడా వేగంగా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ సాఫ్ట్‌వేర్ రంగంలో 1.6 కోట్ల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తుండగా, 2022 నాటికి తక్కువ నైపుణ్యాలు కలిగిన 30 లక్షల మందిని తగ్గించుకోవాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయని తెలిపింది. దీంతో ఏడాదికి వారికి చెల్లిస్తున్న 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7.5 లక్షల కోట్లు) వేతనాల్ని ఆదా చేసుకొనే లక్ష్యంతో కంపెనీలు ఉన్నట్లు నివేదిక వివరించింది. దేశీయ ఐటీ రంగంలోని 1.6 కోట్ల మంది ఉద్యోగుల్లో 90 లక్షల మంది తక్కువ నైపుణ్యం కలిగిన సేవలు, బీపీఓ ఉద్యోగాల్లో పని చేస్తున్నారని పేర్కొంది. ఈ 90 లక్షల మందిలోనే 30 శాతం మంది (సుమారు 30 లక్షలు) 2022 నాటికి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని, రోబో ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్‌పీఏ) ప్రభావంతోనే 7 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యే పరిస్థితి ఉందని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. ఆర్‌పీఏతో అమెరికాలో 10 లక్షల ఉద్యోగాలు పోయాయి.
- భారత్ అవసరాల కోసం పనిచేస్తున్న ఒక్కో ఉద్యోగి సరాసరి వార్షిక వేతనం 25,000 డాలర్లు, అమెరికా అవసరాల కోసం పనిచేస్తున్న వారికి 50,000 డాలర్ల మేర చెల్లిస్తున్నారు. తొలగించాలని భావిస్తున్న వారికి చెల్లిస్తున్న వార్షిక వేతనాలు, ఇతర వ్యయాల కోసం సుమారు రూ.7.5 లక్షల కోట్ల మేర కార్పొరేట్ సంస్థలు ఆదా చేసుకోవాలని చూస్తున్నాయని నివేదిక వివరించింది.
- ఆర్‌పీఏ అప్-స్కిల్లింగ్‌తో 2022 నాటికి తక్కువ నైపుణ్యం ఉన్న 30 లక్షల మందిని తగ్గించుకోవాలని టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ సహా పలు సంస్థలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయని నివేదిక పేర్కొంది.
- మనుషులతో పోలిస్తే రోబోలు 24 గంటలు పని చేస్తాయని, ఆర్‌పీఏను ఐటీ సంస్థల్లో విజయవంతంగా అమలు చేస్తే 10:1 నిష్పత్తిలో వ్యయాలు ఆదా అవుతాయని నివేదిక తెలిపింది.
- రోబో ప్రాసెస్ ఆటోమేషన్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. ఫిజికల్ రోబోలు కాదు. రోజువారీ సాధారణ, అధిక పరిమాణంలో ఉండే విధులు వంటివి వీటితో చేయించుకోవచ్చు. ఉద్యోగులు మరింత విభిన్న పనుల మీద దృష్టి పెట్టేందుకు దోహదం చేస్తుంది. సాధారణ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లకు భిన్నంగా ఆర్‌పీఏ ఉంటుంది.
- దేశీయ ఐటీ రంగానికి ఆఫ్‌షోరింగ్ ఎంతగానో సాయం చేసింది. 1998లో జీడీపీలో ఈ రంగం వాటా 1 శాతం ఉండగా, ఇవాళ అది 7 శాతానికి చేరింది. అసెంచర్, క్యాప్‌జెమిని, అటాస్ వంటి కంపెనీలు 2005-19 మధ్య 18 శాతం వార్షిక ఆదాయ వృద్ధి నమోదు చేశాయి.
- ఇప్పటివరకు తక్కువ వ్యయమయ్యే భారత్ వంటి దేశాలకు ఆర్డర్లు ఇచ్చిన విదేశీ సంస్థలు, ఇప్పుడు ఆయా దేశాల ప్రభుత్వ విధానాల వల్ల ఈ విధానాన్ని ఉపసంహరించుకుంటున్నాయి. ఇది కూడా ఇక్కడ ఉద్యోగాల తొలగింపునకు కారణమవుతుందని నివేదిక వివరించింది.. డిజిటల్ సరఫరా వ్యవస్థలను సురక్షితంగా ఉంచుకునేందుకు అభివృద్ధి చెందిన దేశాల్లోని సంస్థలు కూడా ఆర్‌పీఏ ను వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
- యాంత్రీకరణ ఇంతగా ఉన్నా కూడా, జర్మనీ (26 శాతం), చైనా (7 శాతం), భారత్ (5 శాతం), కొరియా, బ్రెజిల్, థాయిలాండ్, మలేషియా, రష్యా కూడా నిపుణుల కొరతను ఎదుర్కోనున్నాయి. నైపుణ్యాలు కలిగిన వారి లభ్యత లేకపోవడమే ఆటోమేషన్ వేగవంతానికి కారణమని నివేదిక చెబుతోంది.