రాబోయేది పండగల సీజన్. అమ్మకాలు పెరుగుతాయనే భావనతో వ్యాపార సంస్థలు ఎంతో సంతోషంగా ఉంటాయి. కానీ ఈసారి దేశీయ వాహన కంపెనీలకు అటువంటి సంతోషమే లేదు. కార్లకు గిరాకీ అధికంగా ఉన్నా, సరఫరా చేయలేకపోవడమే ఇందుకు కారణం. దీనికి ప్రధాన కారణం చిప్‌ల కొరతే. నాలుగైదు నెలలుగా వేధిస్తున్న ఈ సమస్యకు పరిష్కారం లభించకపోగా, రోజురోజుకూ పెద్దదవుతోంది. ఫలితంగా దేశీయ వాహన కంపెనీలు ఉత్పత్తి తగ్గించాల్సి వస్తోంది. మారుతీ సుజుకీ ఇండియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉత్పత్తిలో కోత పెడుతున్నట్లు వెల్లడించాయి. అందువల్ల ఈ నెలలో కార్ల ఉత్పత్తి బాగా తగ్గిపోనుంది.
ఆగస్టు అమ్మకాలపై ప్రభావం..
- ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత వల్ల ఆగస్టులో వాహన అమ్మకాలపై ప్రభావం పడిందని, పరిష్కారం కనుగొనే యత్నాల్లో ఉన్నట్లు మారుతీ సుజుకీ స్పష్టం చేసింది.
- సెమీకండక్టర్ల సమస్య తీవ్రంగా ఉందని మహీంద్రా అండ్ మహీంద్రా పేర్కొంది. ఈ సంస్థ ఆగస్టు కార్ల అమ్మకాల్లో 17 శాతం వృద్ధి నమోదు చేసింది. థార్, ఎక్స్‌యూవీ 300, బొలేరో నియో మోడళ్లకు అధిక గిరాకీ కనిపించింది. చిప్‌ల కొరత వల్ల సెప్టెంబరులో ఆటోమోటివ్ డివిజన్ ప్లాంట్లలో 7 రోజుల పాటు ఉత్పత్తి నిలిపి వేస్తామని, కార్ల ఉత్పత్తి 25 శాతం తగ్గే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణలోని జహీరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని చకన్, నాసిక్, కండివలి, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఈ ప్లాంట్లు ఉన్నాయి.
- చిప్ సెట్లను ఓఈఎం వెండర్ల నుంచి కాకుండా బహిరంగ విపణిలో అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోందని టాటా మోటార్స్ వర్గాలు వివరిస్తున్నాయి.
- ఫోర్డ్, ఎంజీ మోటార్, రెనో, నిస్సాన్.. వంటి కార్ల కంపెనీలూ ఇప్పటికే తమ ఉత్పత్తి తగ్గించాయి.
- సెమీకండక్టర్ల ఉత్పత్తి అధికంగా ఉన్న తూర్పు ఆసియా దేశాల్లో కొవిడ్ ప్రభావంతో లాక్డౌన్లు విధించడం వల్ల, చిప్‌లకు కొరత ఇంకా అధికమైనట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది చివరికి లేదా 2022 ప్రారంభంలో ఈ సమస్య కొంతమేరకు పరిష్కారం కాగలదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ముందస్తు బుకింగ్‌లు..