గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ఆసియాలో అతిపెద్ద ఆటో కార్నివాల్పై కరోనా ప్రభావం పడింది. వైరస్ వ్యాపిస్తుందనే భయంతో వాహన ప్రేమికులు మాస్కులు ధరించి రావడం స్పష్టంగా కనిపించింది.
ఆటో ఎక్స్పో 2020 ప్రధాన మోటార్ షో (15వ ఎడిషన్) ... దేశ రాజధానికి 30 కి.మీ దూరంలో జరుగుతుండగా, దిల్లీ ప్రగతి మైదానంలో కాంపోనెంట్స్ షో నిర్వహిస్తున్నారు. అయితే కరోనా భయంతో ఈసారి సందర్శకుల సందడి బాగా తగ్గింది. వచ్చిన వారిలో కూడా చాలా మంది ముసుగులు ధరించారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ల పరిస్థితీ అంతే.
సాధారణంగా ఆటో ఎక్స్పోలకు చైనీయులు ఎప్పుడూ భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. అయితే ఈసారి వీసా రద్దు కారణంగా వారి సంఖ్య కూడా తగ్గింది.
తగ్గిన చైనా భాగస్వామ్యం
ఆటోఎక్స్పోలో ఈసారి ముఖ్యంగా చైనా సంస్థల ప్రాతినిధ్యం, ఆసక్తి బాగా తగ్గింది. మందగమనానికి తోడు కరోనా సృష్టించిన భయమే ఇందుకు కారణం. కరోనా వల్ల ఇప్పటికే చైనాలోని పలు వాహన తయారీ యూనిట్లలో పని నిలిచిపోయింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే వాహన పరిశ్రమపై ఆ దుష్ప్రభావం మరింత దారుణంగా ఉంటుంది.
ప్రపంచ వాహనరంగంలో చైనాది ఒక ప్రధాన పాత్ర. వాహనాలు మాత్రమేకాక, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో వాహన విడిభాగాలను కూడా చైనాలో తయారుచేస్తారు. ఎస్ఏఐసీ మోటార్స్, బీవైడీ, గ్రేట్వాల్ మోటార్స్, లాంటి అనేక అగ్రస్థాయి వాహన పరిశ్రమలు చైనాలో ఉన్నాయి. వాస్తవానికి చైనాను ప్రభావితం చేసేది ఏదైనా.. అది మొత్తం ప్రపంచ వాహన రంగాన్ని ప్రభావితం చేస్తుంది.