తెలంగాణ

telangana

ETV Bharat / business

చైనా డంపింగ్‌పై అరబిందో ఫార్మా ఫిర్యాదు - అరబిందో ఫార్మా ఏపీఐ డ్రగ్​

యాంటీ-బయాటిక్‌ ముడి ఔషధాలను చైనా కంపెనీలు తక్కువ ధరకు ఎగుమతి చేయడాన్ని దేశీయ ఫార్మా దిగ్గజం అరబిందో తప్పుపట్టింది. దీనివల్ల భారతీయ ఫార్మా రంగం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లగా.. 'ట్రేడ్‌ రెమిడీస్‌' డైరెక్టరేట్‌ విచారణ ప్రారంభించింది.

అరబిందో
అరబిందో

By

Published : Sep 15, 2021, 5:59 AM IST

ఔషధ పరిశ్రమకు కీలకమైన ముడి ఔషధాలు, ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్స్‌)ల కోసం చైనాపై ఆధార పడటాన్ని తగ్గించాలని, ఈ విభాగాల్లో స్వయం సమృద్ధి సాధించాలని కేంద్ర ప్రభుత్వం పలు రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఫార్మా పరిశ్రమతో కలిసి బల్క్‌ ఔషధాల పార్కులు ఏర్పాటు చేయడం, వివిధ పథకాల కింద రాయితీలు, సత్వర అనుమతులు ఇవ్వడం.. వంటి చర్యలు చేపడుతోంది. కానీ చైనా మాత్రం ముడి రసాయనాలను మనదేశంలోకి అతి తక్కువ ధరలకు కుమ్మరించడం (డంపింగ్‌) ద్వారా దేశీయ పరిశ్రమను ఎదగనీయకూడదనే ప్రయత్నాలు చేపట్టింది. ఈ వ్యవహారాన్ని స్థానిక కంపెనీ అరబిందో ఫార్మా కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లింది. దీన్ని సమగ్రంగా పరిశీలించి యాంటీ-డంపింగ్‌ చట్టాల కింద చర్యలు తీసుకోవాలని 'డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌'ను కోరింది.

ఈ ఔషధాల్లో..

ఎన్నో రకాల జబ్బులకు చికిత్సలో వినియోగించే సెమీ-సింథటిక్‌ యాంటీ-బయోటిక్‌ ఔషధమైన ఆమోక్సిసిలిన్‌/ అమోక్సిసిలిన్‌ ట్రైహైడ్రేట్‌ను మనదేశంలో అరబిందో ఫార్మా అత్యధికంగా ఉత్పత్తి చేస్తోంది. పీనమ్‌ లేబొరేటరీస్‌, సెట్రియంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఇండియా, మరికొన్ని దేశీయ కంపెనీలు ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేసి దేశీయంగా విక్రయిస్తూ, ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాయి. భారత కంపెనీలను నష్టపరచి, పూర్తిగా తమపై ఆధారపడేలా చూసుకునేందుకు కొన్ని చైనా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం బాగా తక్కువ ధరకు భారత్‌కు ఎగుమతి చేస్తున్నాయి. ఫలితంగా దీర్ఘకాలంలో దేశీయ ఫార్మా పరిశ్రమ నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఇదే ప్రయత్నాన్ని చైనా కంపెనీలు అయిదారేళ్ల క్రితమూ చేశాయి. అప్పట్లో ప్రభుత్వం దీన్ని గమనించి పెద్దఎత్తున ‘డంపింగ్‌ డ్యూటీ’ విధించడంతో అప్పట్లో సర్దుమణిగింది.

స్పందించిన ప్రభుత్వం..

మళ్లీ ఇటీవల కాలంలో తక్కువ ధరకే ఈ ముడి ఔషధాలను చైనా కంపెనీలు మనదేశంలో కుమ్మరించడం ప్రారంభించాయి. ఈ విషయాన్ని అరబిందో ఫార్మాతో పాటు ఇతర కంపెనీలు తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, కఠిన చర్యలు తీసుకోవలసిందిగా కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ రెమిడీస్‌’, ఈ వ్యవహారంపై విచారణ చేపడుతూ ఈనెల 10న ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆమోక్సిసిలిన్‌/ అమోక్సిసిలిన్‌ ట్రెహైడ్రేట్‌ను ఉత్పత్తి చేస్తున్న, విక్రయిస్తున్న సంస్థలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించడంతో పాటు, అభిప్రాయాలను తెలియజేయాలని ఆ నోటిఫికేషన్‌లో కోరింది. చైనా కంపెనీలు 6-ఏపీఏ ను ఏ ధరకు విక్రయిస్తున్నాయి, మనదేశానికి ఏ ధరకు సరఫరా చేస్తున్నాయనేది పరిశీలించనున్నట్లు పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details