వచ్చే ఏడాది జనవరి నుంచి ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. నెలవారీ ఉచితంగా అనుమతించిన వాటికి మించి చేసే నగదు, నగదేతర ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలు పెంచుకునేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.
ఖర్చులు పెరగటం వల్లే..
2022 జనవరి 1 నుంచి నెలవారీ ఉచిత లావాదేవీలు ముగిశాక చేసే ప్రతి లావాదేవీపై ఖాతాదారులు రూ.21 చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి లావాదేవీలపై ప్రస్తుతం వినియోగదారుల నుంచి బ్యాంకులు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నాయి. ఏటీఎం కేంద్రాలు నెలకొల్పేందుకు-నిర్వహణకు వ్యయాలు పెరగడం, సాధారణ ఖర్చులకు గాను వినియోగదారు ఛార్జీలు పెంచుకునేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. సొంత బ్యాంక్ ఏటీఎంల నుంచి వినియోగదారులు ప్రతినెలా 5 ఉచిత లావాదేవీలు(ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు కలిపి) నిర్వహించుకోవడం కొనసాగనుంది. మెట్రో కేంద్రాల్లో ఇతర బ్యాంకు ఏటీఎంలలో 3 ఉచిత లావాదేవీలు, మిగతా ప్రాంతాల్లో 5 లావాదేవీలను అనుమతిస్తారు.