ATF Price Hike: విమాన ఇంధన ధరలు భారీగా పెరిగాయి. కిలోలీటర్ ఏకంగా 18 శాతం వృద్ధి చెంది రూ.లక్ష మార్కును అధిగమించింది. ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు ఈ స్థాయికి చేరడం చరిత్రలో ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరడం విమాన ఇంధన ధరలపైనా తీవ్ర ప్రభావం చూపింది.
ఏటీఎఫ్ ధరలను ప్రతి నెల 1, 16వ తేదీల్లో సవరిస్తారు. ఏ ఏడాది ధరలు పెరగడం వరుసగా ఇది ఆరోసారి. కొత్త ధర ప్రకారం దిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ రూ.17,135 (18శాతం) పెరిగి రూ.110,666కి చేరింది. గతవారం అంతర్జాతీయంగా చమురు బ్యారెల్ ధర రికార్డు స్థాయిలో 140 డాలర్లకు పెరిగింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. దీంతో విమాన ఇంధన ధరలకు కూడా రెక్కలొచ్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఏటీఎఫ్ ధర 50 శాతం పెరగడం గమనార్హం.