తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ నెలలో రెండోసారి పెరిగిన విమాన ఇంధన ధరలు - atf fuel price per litre in india

ATF Fuel Price Hike: విమాన ఇంధన ధరను 4.2 శాతం పెంచినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ఆదివారం ప్రకటించాయి. ఈ నెలలో ధరలు పెరగడం ఇది రెండోసారి.

ATF Fuel Price Hike
విమాన ఇంధన ధరలు

By

Published : Jan 17, 2022, 5:32 AM IST

ATF Fuel Price Hike: అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నందున విమాన ఇంధన (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌) ధరను 4.2 శాతం పెంచినట్లు ఆదివారం చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి. ఈ నెలలో ధరలు పెరగడం ఇది రెండోసారి. కానీ, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మాత్రం గత 72 రోజులుగా ఎలాంటి మార్పు లేకపోవడం విశేషం.

విమానాల ఇంధన ధర దిల్లీలో కిలోలీటర్‌కు రూ.3,232.87 పెరిగి, రూ.79,294.91కి చేరింది. జనవరి 1నే ఏటీఎఫ్‌ ధరను 2.75 శాతం అంటే కిలోలీటర్‌కు రూ.2,039.63 పెంచారు. నవంబరు 2021 మధ్యలో ఏటీఎఫ్‌ ధరలు కిలోలీటర్‌కు రూ.80,835.04 వద్ద గరిష్ఠానికి చేరాయి.

దీంతో డిసెంబరు 1, 15న రెండు దఫాల్లో 8.4 శాతం మేర ధరల్ని తగ్గించారు. దీంతో డిసెంబరు చివరికి కిలోలీటర్‌ ఏటీఎఫ్‌ ధర గరిష్ఠం నుంచి రూ.6,812.25 తగ్గింది. కానీ, తిరిగి జనవరిలో ధరలను పెంచుతుండడం గమనార్హం.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర నవంబరు 5, 2021న 82.74 డాలర్లకు చేరింది. అనంతరం డిసెంబరు 1 నాటికి 68.87 డాలర్లు పడిపోయింది. దీంతో చమురు మార్కెటింగ్‌ సంస్థలు డిసెంబరులో ఏటీఎఫ్‌ ధరల్ని తగ్గించాయి. తర్వాత ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర 85 డాలర్ల వద్ద ఉంది. దీంతో ఏటీఎఫ్‌ ధరల్ని సంస్థలు మళ్లీ పెంచుతున్నాయి.

ఇదీ చూడండి:ఎస్​బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఎఫ్​డీలపై వడ్డీ రేట్లు పెంపు!

ABOUT THE AUTHOR

...view details