రోజువారీ సంపద అత్యధికులకు రూపాయల్లో ఉంటుంది. కుబేరులకు మాత్రం రూ.కోట్లలో ఉంటుంది. అందులోనూ అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ తీరే వేరు. ఈయన గతేడాది కాలంగా రోజుకు రూ.1002 కోట్లు ఆర్జించారట. దీంతో గతేడాదితో పోలిస్తే ఈయన సంపద విలువ 261 శాతం పెరిగి రూ.5,05,900 కోట్లకు చేరింది. భారత్‌లోనే కాదు ఆసియాలోనే రెండో అగ్రగామి కుబేరుడిగా అదానీ నిలిచినట్లు గురువారం ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ హురున్ ఇండియా 100 మందితో రూపొందించిన రిచ్ లిస్ట్-2021 పేర్కొంది. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.9 లక్షల కోట్లకు చేరగా, ఆయన ఆధ్వర్యంలో రూ.లక్ష కోట్లకు పైగా విలువైన కంపెనీలు 5 ఉన్నట్లు హురున్ పేర్కొంది. దుబాయ్‌లో ఉన్న అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ అదానీ కుటుంబం ఏకంగా 12 స్థానాలు ఎగబాకి ఈ జాబితాలో ఎనిమిదో స్థానానికి చేరారు.
23 ఏళ్లకే జాబితాలోకి.. :
చెల్లింపుల యాప్ భారత్‌పే వ్యవస్థాపకుడు శాశ్వత్‌నక్రానీ 23 ఏళ్లకే టాప్-100 జాబితాలో చేరారు. ఐఐటీ (దిల్లీ)లో మూడో సంవత్సరం చదువుతూనే 2018లో ఈ యాప్‌ను నక్రానీ రూపొందించారు. జాబితాలో 13 మంది 1990ల్లో జన్మించి.. స్వయంకృషితో ఈ స్థాయికి చేరారు.
- గతేడాదితో పోలిస్తే 13 మంది వ్యక్తుల సంపద రూ.లక్ష కోట్లకు పైగా జత అయింది.
- పదేళ్ల కిందటితో పోలిస్తే బిలియనీర్ల సంఖ్య నాలుగింతలై 237కు చేరింది. గతేడాది కంటే 58 మంది అదనంగా చేరారు.
- 40మంది ఔత్సాహిక పారిశ్రామివేత్తలు జాబితాలో చోటు చేసుకున్నారు. ఫార్మా, రసాయనాలు-పెట్రోరసాయనాలు, సాఫ్ట్‌వేర్ రంగాల్లో వీరున్నారు.
- 894 మంది సంపద పెరగ్గా.. అందులో 229 మంది కొత్తవారు. 113 మంది సంపద తగ్గింది.
- 659 మంది లేదా 66% మంది స్వయం కృషితో ఈ స్థాయికి చేరినవారే.
- ముంబయి(255), దిల్లీ(167), బెంగళూరు(85)లు ఎక్కువ మంది కుబేరులను కలిగి ఉన్నాయి.
- జాబితాలో ఉన్న వారిలో రతన్ టాటాకు ట్విటర్‌లో కోటి మంది ఫాలోవర్లు ఉండడం విశేషం. ఆయన తర్వాతి స్థానంలో 85 లక్షల మంది ఫాలోవర్లతో ఆనంద్ మహీంద్రా ఉన్నారు.