కరోనా విజృంభణతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు సైతం ఉద్యోగులకు తీపి కబురు చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ఓ సర్వే ప్రకారం భారత్లోని 59 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు శాలరీ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని యోచిస్తున్నాయి.
దీనిపై జీనియస్ కన్సల్టెంట్స్ అనే సంస్థ.. 'టెన్త్ హైరింగ్, అట్రిషన్ అండ్ కాంపెన్సేషన్ ట్రెండ్ 2021-21' పేరిట సర్వే నిర్వహించింది. 1200 కంపెనీలను ఫిబ్రవరి-మార్చిలో ఆన్లైన్ ద్వారా సర్వే చేసి ఈ ఫలితాలను రూపొందించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్/టీచింగ్/ట్రైనింగ్, ఎఫ్ఎంసీజీ, ఆతిథ్యం, హెచ్ఆర్ సొల్యూషన్స్, ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ, లాజిస్టిక్స్, తయారీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, మెడికల్, పవర్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, రిటైల్, టెలికాం, ఆటో, అనుషంగిక రంగాలకు చెందిన సంస్థలను సర్వే చేసి దీన్ని రూపొందించింది.
"ఈ ఏడాది ఇంక్రిమెంట్ల విషయంలో కంపెనీలు సానుకూలంగా ఉన్నాయి. 59 శాతం కంపెనీలు ఇంక్రిమెంట్ ఉందని చెబుతున్నాయి. 5-10 శాతం ఇంక్రిమెంట్ ఉంటుందని భావిస్తున్నారు. 20 శాతం కంపెనీలు ఇంక్రిమెంట్ 5 శాతం కన్నా తక్కువగా ఉంటుందని భావిస్తున్నాయి. 2021లోనూ ఇంక్రిమెంట్ ఉండదని 21 శాతం కంపెనీలు స్పష్టం చేశాయి."