గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్ రంగాన్ని మొండి బకాయిల సమస్య వేధిస్తోంది. కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన భారీ రుణాలే ఇందుకు ప్రధాన కారణం. ఆర్‌బీఐ కఠిన విధానాలు అమలు పరచడం వలన బ్యాంకులు ఆచితూచి రుణాలిస్తున్నాయి. మొండి బకాయిలపై కేటాయింపులు చేయడం లేదా రద్దు చేయడం వల్ల బ్యాంకులు ఎన్‌పీఏలను తగ్గించుకుంటూ వస్తున్నాయి.
నష్టభయం అధికంగా ఉండటం వలన కార్పొరేట్ రుణాలివ్వడాన్ని తగ్గిస్తున్న బ్యాంకులు.. రిటైల్ రుణాలపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా మిలీనియల్స్ (1980 తర్వాత పుట్టినవారు)ను లక్ష్యంగా చేసుకుని బ్యాంకులు ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారొచ్చని, ఇవి మొండి బకాయిలుగా మారే అవకాశం లేకపోలేదని ఒక నివేదిక హెచ్చరించింది. కొత్త రుణాలు తీసుకుంటున్న మిలీయనల్స్ సంఖ్య 58 శాతం పెరగ్గా, మిగతా వారి సంఖ్య 14 శాతం మాత్రమే పెరిగిందని ట్రాన్స్‌యూనియన్- సిబిల్ అధ్యయనం స్పష్టం చేసింది.
నివేదికలోని పలు అంశాలు ఇలా..
రుణాల వృద్ధి కోసం బ్యాంకులు రిటైల్ రుణాలపై అధికంగా ఆధారపడుతున్నాయి. కార్పొరేట్ విభాగంతో పోలిస్తే నష్టభయం తక్కువగా ఉన్నప్పటికీ.. బ్యాలెన్స్ షీట్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మిలీనియల్స్ ఆర్థిక వ్యయాలపై సైతం ఆందోళనలు పెరుగుతున్నాయి. పొదుపు చేసే వారి సంఖ్య తగ్గడం వల్ల జాతీయ పొదుపు రేటు క్షీణించడానికి దారితీస్తోంది.