టెక్ దిగ్గజం యాపిల్ చైనా యాప్ స్టోర్ నుంచి 4,500 గేమ్‌లను తొలగించింది. తమ నిబంధనలు పాటించని యాప్‌లపై చర్యలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఇందులో 3,000లకుపైగా గేమ్‌లను గత వారమే... అది కూడా రెండు రోజుల్లోనే తొలగించింది యాపిల్. ఈ స్థాయిలో గేమ్‌లను తొలగించడం ఇదే ప్రథమం.
ఇటీవలే 59 చైనా యాప్‌లపై భారత్ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
కొత్త నిబంధనలు..
జూలై 1 నుంచి చైనా కొత్త ఇంటర్నెట్ పాలసీ అమలు చేస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం చైనా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాకే గేమ్ డెవలపర్లు.. తమ గేమ్‌లు యాపిల్ యాప్ స్టోర్‌లో అప్లోడ్ చేయాలి.
అయితే ఈ నిబంధలు గేమ్ డెవలపర్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని యాపిల్ చైనా మార్కెటింగ్ ప్రతినిధి తెలిపారు. చైనా ఏడాదికి 1,500 గేమ్‌లకు మాత్రమే లైసెన్సులు ఇస్తుందని చెప్పుకొచ్చారు. గేమ్‌లకు లైసెన్స్ ఇచ్చే ప్రక్రియ పూర్తి చేసేందుకు చైనా ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం తీసుకుంటుందని వెల్లడించారు. దీని వల్ల గేమ్ డెవలపర్లు అనుమతుల కోసం దీర్ఘ కాలంపాటు వేచి చూడాల్సి వస్తుందని అన్నారు.
చైనా తీసుకొచ్చిన కొత్త పాలసీలతో దాదాపు 20 వేల యాప్‌లపై ప్రభవం పడొచ్చని తెలుస్తోంది.
సెన్సర్ టవర్ డేటా ప్రకారం యాపిల్ యాప్ స్టోర్‌కు చైనా అతిపెద్ద మార్కెట్. యాప్ స్టోర్ ద్వారా చైనాలో ఏడాదికి 16.4 బిలయన్ డాలర్లు గడిస్తుంది. అమెరికాలో ఇది 15.4 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:వైరస్‌ను కడిగే ఫోన్ సోప్ గురించి తెలుసా?