యాపిల్ సీఈఓను టిమ్ కుక్‌ను క్యాలిఫోర్నియాలోని స్థానిక జిల్లా కోర్టు శుక్రవారం విచారించింది. యాపిల్.. గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ప్రముఖ గేమింగ్ సంస్థ 'ఎపిక్ గేమ్స్' దాఖలు చేసిన వాజ్యంపై విచారణలో భాగంగా టిక్ కుక్‌ను ప్రశ్నించింది.
యాపిల్ సంస్థ ఇన్‌యాప్ ట్రాన్సాక్షన్స్‌కు 15 నుంచి 30 శాతం కమీషన్ పొందడమే కాక పేమెంట్లకు సంబంధించి యాప్‌లు అందించే ప్రత్యామ్నాయాలను వినియోగదారులకు అందుబాటులో లేకుండా బ్లాక్ చేస్తోందని ఎపిక్ గేమ్స్ తన పిటిషన్లో పేర్కొంది. కమీషన్ లేకుండానే సబ్స్క్రిబ్షన్లకు చెల్లింపులు చేసేందుకు యాప్‌లు అందించే వెబ్‌పేజ్ లింక్‌లను కూడా రద్దు చేస్తోందని ఎపిక్ గేమ్స్ పేర్కొంది.
ఎపిక్ గేమ్స్ వ్యాజ్యంపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ గొనలేజ్ రోజర్స్.. ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్లలో తక్కువ కమీషన్‌తో సేవలు అందించే ఇతర సంస్థలకు ఇన్ట్రాన్సాక్షన్స్ ఆప్షన్ ఎందుకు కల్పించరని ప్రశ్నించారు. యాపిల్ వైఖరిపై 39 శాతం యాప్ డెవలపింగ్ సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయన్న ఓ సర్వే గురించి న్యాయమూర్తి ప్రస్తావించారు. ప్రస్తుత కమీషన్ వ్యవస్థలో గేమింగ్ యాప్‌లకు ఎక్కవ కమీషన్ పొందుతూ ఇతర యాప్‌ల నుంచి తక్కువ కమీషన్ వసూల చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సంస్థ పలు యాప్‌లకు సబ్సిడీలు అందిస్తోందని వ్యాఖ్యానించారు.
ఇబ్బందికి గురైన టిమ్..
నాలుగు గంటల పాటు జరిగిన విచారణలో.. ఎపిక్ గేమ్స్ తరఫు న్యాయవాది గేరీ బోర్న్స్టేయిన్ అడిగిన పలు ప్రశ్నలకు టిక్‌కుక్ ఇబ్బందికి గురయ్యారు. యాప్ స్టోర్ ద్వారా సంస్థ పొందుతున్న లాభాలు, వినియోగదారుల ప్రైవసీపై చైనాతో రాజీపడ్డారన్న ఆరోపణలపై అడిగిన ప్రశ్నలకు ఇబ్బంది పడ్డారు.