తెలంగాణ

telangana

ETV Bharat / business

అందుబాటులోకి యాంటీ-బాడీ కాక్​టెయిల్​- ధర రూ.59,750 - యాంటీ-బాడీ కాక్‌టెయిల్‌ ఔషధం

యాంటీ-బాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని మనదేశంలో అందుబాటులోకి తెచ్చినట్లు రోష్‌ ఇండియా, సిప్లా లిమిటెడ్‌ ప్రకటించాయి. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్‌-19తో బాధపడుతూ, వ్యాధి ముదిరే ప్రమాదం ఉన్న వారికి ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని సంస్థల ప్రతినిధులు ప్రకటించారు.

Anti-body cocktail medicine
కొవిడ్‌ బాధితులకు యాంటీ-బాడీ కాక్‌టెయిల్‌ ఔషధం

By

Published : May 25, 2021, 6:46 AM IST

కొవిడ్‌-19 బాధితులకు చికిత్సలో వినియోగించే యాంటీ-బాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని మనదేశంలో అందుబాటులోకి తెచ్చినట్లు రోష్‌ ఇండియా, సిప్లా లిమిటెడ్‌ ప్రకటించాయి. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కొవిడ్‌-19 తో బాధపడుతూ, వ్యాధి ముదిరే ప్రమాదం ఉన్న వారికి ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని రోష్‌ ఇండియా పేర్కొంది. తత్ఫలితంగా వారికి ప్రాణాపాయం గణనీయంగా తగ్గుతుందని వివరించింది.

రోష్‌కు చెందిన ఈ ఔషధాన్ని సిప్లా పంపిణీ చేస్తుంది. కాసిరివిమ్యాబ్‌, ఇండెవిమ్యాడ్‌ అనే ఔషధాల మిశ్రమమైన ఈ యాంటీ-బాడీ కాక్‌టెయిల్‌ను 2 లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఒక లక్ష ప్యాకెట్లను రెండు దఫాలుగా వచ్చే నెల రెండో వారం నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు రోష్‌ ఇండియా, సిప్లా లిమిటెడ్‌ వెల్లడించాయి. ఒక ప్యాకెట్‌తో ఇద్దరికి చికిత్స చేయొచ్చు. ప్యాకెట్‌ ధర రూ1,19,500 కాగా, ఒక్కో రోగికి ఇచ్చే డోసుకు రూ.59,750 అవుతుంది.

ఆసుపత్రులు, కొవిడ్‌-19 చికిత్సా కేంద్రాల్లో ఈ ఔషధం లభిస్తుందని సిప్లా పేర్కొంది. ఈ కాక్‌టెయిల్‌కు మనదేశంలో సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఇటీవల అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అమెరికా, పలు ఐరోపా దేశాల్లోనూ దీనికి అత్యవసర అనుమతి ఉంది. కొవిడ్‌-19 ముప్పు అధికంగా ఉన్న రోగులకు ఈ మందుతో మేలు జరుగుతుందని భావిస్తున్నట్లు రోష్‌ ఇండియా సీఈఓ సింప్సన్‌ ఇమ్మాన్యుయేల్‌ పేర్కొన్నారు. తమకు ఉన్న మార్కెటింగ్‌- పంపిణీ సామర్థ్యంతో దేశవ్యాప్తంగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని సిప్లా ఎండీ ఉమంగ్‌ వోహ్రా వివరించారు.

ఇదీ చూడండి:భారత్​లో స్పుత్నిక్​ వీ టీకాల ఉత్పత్తి ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details