కొవిడ్-19 కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు కొన్ని రాష్ట్రాల్లో విధిస్తున్న లాక్డౌన్ల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోగా.. ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అనిల్ అంబానీ తనయుడు అన్మోల్ అంబానీ అభిప్రాయపడ్డారు. గతంలో రిలయన్స్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అన్మోల్ బాధ్యతలు నిర్వర్తించారు. కొత్తగా విధిస్తున్న పాక్షిక లాక్డౌన్ నియమాలు చిన్న వ్యాపారాలు, రోజువారీ కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్మోల్ వరుస ట్వీట్లు చేశారు.
"నటీనటులు వారి సినిమాలకు పని చేయొచ్చు. క్రికెటర్లు క్రికెట్ ఆడుకోవచ్చు. రాజకీయ నాయకులు భారీగా జనాలను సమీకరించి ర్యాలీలు నిర్వహించుకోవచ్చు. అయితే.. చిరు వ్యాపారులు, కార్మికుల పనుల మాత్రం ఆగిపోతాయి." అని అన్మోల్ ట్విట్టర్లో వెల్లడించారు. హ్యాష్‌ట్యాగ్ స్కామ్డెమిక్ పేరుతో 'ప్రతి వ్యక్తికి అతని పని చాలా అత్యవసరమైనదే'నని పేర్కొన్నారు.