ట్రెండింగ్ అంశాలతో నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా.. తాజాగా ప్రజలకు ఓ పాఠం నేర్పించారు. డబ్బులు వృథాగా ఎలా ఖర్చు చేయకూడదో సొదాహరణంగా చూపించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన ఫెరారీ కారేసుకొని వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటని ఆరా తీస్తే.. అది పూర్తిగా బంగారు పూత పూసిన కారని వీడియో ద్వారా తెలుస్తోంది. ఓ ఇద్దరు వ్యక్తులు దాంట్లో కూర్చుని వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. దాన్ని చూసి చుట్టుపక్కల వారంతా ఆశ్యర్యపోతూ ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ వీడియోపైన 'ఇండియన్ అమెరికన్ విత్ ప్యూర్ గోల్డ్ ఫెరారీ కార్' అని నోట్ రాసి ఉంది.