ఎక్కువగా ప్రయాణాలు చేసే వారు తమకు సొంత క్యారవాన్ ఉంటే బాగుంటుందని కలలు కంటారు. కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది కల కలగానే మిగిలిపోతుంది. అలాంటి వారి కలలను నిజం చేస్తూ ఆటో రిక్షాలో, అత్యంత తక్కువ ధరలో, అన్ని హంగులతో మొబైల్ హౌస్‌ను రూపొందించాడు తమిళనాడు నమక్కల్‌కు చెందిన ఎన్జీ అర్జున్ ప్రభు.
2019లో మూడు చక్రాల ఆటోపై ఉన్న కొద్ది స్థలంలోనే 'సోలో:01- మొబైల్ హౌస్'ను రూపొందించాడు ప్రభు. ఇందుకోసం రూ.లక్ష ఖర్చు చేశాడు. ఇందులో చిన్న కిచెన్, పడక గది, బాత్రూమ్, టాయిలెట్, హాల్, టెర్రస్ వంటివి ఉండటం విశేషం. ఇలా 36 చదరపు అడుగుల్లోనే పోర్టబుల్ ఇంటిని రూపొందించి అందరి మన్ననలు పొందుతున్నాడు ప్రభు.
ఎంఏఆర్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ స్వర్ణభూమి(ఎమ్ఐడీఏఎస్)లో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు అర్జున్. ట్రక్కులు, చిన్న వాహనాల బాడీలను రీడిజైనింగ్ చేయటంలో ప్రసిద్ధి చెందాడు.
ఇలాంటి పోర్టబుల్ ఇళ్లు.. టెంట్లలో నివసించే సంచార వర్గాల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.