తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆర్థికంపై కరోనా పడగ- చిక్కుల్లో ఎన్నో వ్యాపార రంగాలు

గతేడాది నుంచే ఆర్థికవృద్ధి గాడి తప్పింది. ఇంతలో కరోనా మహమ్మారి దాపరించింది. ఫలితంగా లాక్​డౌన్​ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక పరంగా నిలదొక్కుకోవడం అంత సులభం కాదని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. అయితే దేశంలో కరోనా అదుపులోకి వస్తే పరిస్థితులు ఆశాజనకంగా మారవచ్చంటున్నారు ఆర్థికవేత్తలు. ఒకవేళ లాక్​డౌన్​ కొనసాగితే వృద్ధిరేటు కనిష్ఠానికి పడిపోయి, వివిధ రంగాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఈ గడ్డుకాలం ఏం చేయాలి? నిపుణుల మాటల్లో...

An Analysis story on - Coronavirus effect on economic growth in lock down period
ఆర్థికంపై కరోనా పడగ.. అదుపులోకి వస్తే ఆశాజనకం

By

Published : Apr 9, 2020, 6:17 AM IST

గత ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికంలో మనదేశ వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పతనమైంది. అదే సమయంలో కరోనా వైరస్‌ రూపంలో సరికొత్త సవాలు ఎదురు కావడం వల్ల నాలుగో త్రైమాసిక చివరిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించాల్సి వచ్చింది. ఎగుమతులు- దిగుమతులు నిలిచిపోవటం కారణంగా ఆర్థికంగా కుంగుబాటు తప్పేలా లేదు. ఈ కష్టకాలాన్ని తట్టుకుని, మెరుగైన వ్యాపారాన్ని నమోదు చేయడం దేశీయ కంపెనీలకు అంత త్వరగా సాధ్యమయ్యే పనికాదు. కొన్ని కంపెనీలు ఫర్వాలేదనుకున్నా, ఎక్కువ సంస్థలు ఇబ్బందుల్లో చిక్కుకుపోయే అవకాశం ఉంది. ఎన్నో వ్యాపార రంగాలు కుంగిపోయే పరిస్థితి ఉన్నట్లు అగ్రశ్రేణి ఆర్థిక సేవల సంస్థ కేపీఎంజీ తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో మనదేశ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి? ఏమేరకు వృద్ధి రేటు సాధ్యం.. అనే విషయంలో 3 రకాల అంచనాలు వెల్లడించింది.

1 ఏప్రిల్‌ ఆఖరు / మే మధ్య నాటికి కరోనా అదుపులోకి వస్తే..

చైనా ఉత్పత్తి రంగంలో కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ఇతర దేశాల్లోనూ ఈ వ్యాధి అదుపులోకి వచ్చే పక్షంలో 2020-21 ద్వితీయార్థంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవచ్చు. అప్పుడు మనదేశ వృద్ధి రేటు 5.3 - 5.7 శాతంగా నమోదు కావచ్చు. దీనికి అవకాశం కనిపించడం లేదు.

2 మనదేశంలో మాత్రం కోవిడ్‌-19 అదుపులోకి వస్తే..

ప్రపంచంలో అధిక దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడతాయి కాబట్టి పెద్దగా ప్రయోజనం ఉండదు. కాకపోతే మనదేశ వృద్ధి రేటు కొంత ఆశాజనకంగా ఉండొచ్చు. 4 - 4.5 శాతం వృద్ధి రేటు సాధించే వీలుంది.

3 దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగించాల్సి వస్తే..

ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటే మనదేశం కూడా ఆర్థికంగా బాగా నష్టపోయి, వృద్ధి రేటు క్షీణిస్తుంది. మన వృద్ధి రేటు 3 శాతం కంటే దిగువకు పడిపోతుంది.

అసంఘటిత రంగానికి గడ్డుకాలం

దేశంలోని పట్టణాలు, నగరాల్లో జీతభత్యాల మీద ఆధారపడిన వారిలో 37 శాతం మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారు. ఇలాంటి కార్మికుల సంఖ్య రాజస్థాన్‌, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో అధికంగా ఉంది. వీరికి ఆదాయాలు సక్రమంగా, సకాలంలో అందకపోవచ్చు. పని లేక ఇప్పటికే లక్షల మంది తమ ఊళ్లకు తరలివెళ్లారు.

ముడిపదార్థాల దిగుమతులు ఏవీ?

మనదేశం ఎలక్ట్రానిక్స్‌, విద్యుత్తు ఉపకరణాలు- యంత్రాలు, ఆర్గానిక్‌ రసాయనాలు, ప్లాస్టిక్‌ వస్తువులు, ఎరువులు, వాటికి సంబంధించిన ముడిపదార్థాలను భారీగా దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి స్తంభించి, దిగుమతుల మీద ఆధారపడిన వ్యాపార విభాగాల్లోని సంస్థలు ఇబ్బంది పడతాయి.

ముడి చమురు ధర తగ్గినా..

ముడి చమురును అధికంగా దిగుమతి చేసుకునే దేశం మనది. ప్రస్తుతం ముడి చమురు ధర గణనీయంగా తగ్గినా, దానివల్ల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందుకోలేకపోతున్నాం. పెట్రోలియం ఉత్పత్తులకు దేశీయంగా గిరాకీ తగ్గడమే ఇందుకు కారణం.

ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి?

  • నిధుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త పడాలి
  • భౌతిక దూరం పాటిస్తూనే..సమాజంలోని అణగారిన వర్గాల ప్రయోజనాలు కాపాడాలి
  • వైద్య సేవలను యుద్ధ ప్రాతిపదికన విస్తరించాలి
  • ఉత్పత్తి, సరకు రవాణా ఉత్పత్తి కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూడాలి.

వినియోగమే కీలకం

మనదేశంలో ఆర్థికాభివృద్ధికి వినియోగమే ముఖ్యం. జనాభా ఎక్కువ కాబట్టి అధిక వినియోగం, తద్వారా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి జరుగుతుంది. లాక్‌డౌన్‌ వల్ల నిత్యావసరాల వినియోగం పెద్దగా తగ్గకపోయినా, వాయిదా వేయగల వినియోగం పూర్తిగా క్షీణిస్తుంది. కొన్ని రకాల సేవలకు అసలు గిరాకీ ఉండదు. కరోనా అదుపులోకి వచ్చాకా, కొంతకాలం పాటు ప్రజల ఆలోచనలు- అలవాట్లలో మార్పు ఉంటుంది. తప్పనిసరైతేనే ఖర్చు చేసే పరిస్థితులు వచ్చి, పరోక్షంగా ఆర్థికాభివృద్ధి మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ఆర్థికంపై కరోనా పడగ.. అదుపులోకి వస్తే ఆశాజనకం

2020-21లో వృద్ధి 1.6 శాతమే

గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ అంచనా

కొవిడ్‌-19 మహమ్మారి వ్యాప్తి వల్ల తలెత్తిన పరిస్థితులు, నిరోధానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఈ ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వృద్ధి కొన్ని దశాబ్దాల కనిష్ఠమైన 1.6 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని అమెరికా బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అంచనా వేసింది. ప్రస్తుత సంక్షోభంలో విధాన నిర్ణేతలు ఇప్పటివరకు దూకుడుగా స్పందించలేదని, రాబోయే కాలంలో వారు మరింతగా తమ ప్రయత్నాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌లోని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.

ఒకవేళ కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభించకపోయినా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 5 శాతమే నమోదు కావొచ్చని సంస్థ గతంలో అంచనా వేసింది. ఇప్పుడు వైరస్‌ ప్రభావంతో వృద్ధిరేటు మరింత దిగజారొచ్చని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ పేర్కొంది. ఇప్పటివరకు చాలా బ్రోకరేజీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును గణనీయంగా తగ్గిస్తూ అంచనాలు వెలువరించాయి. అయితే గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ అంచనా వేసిన 1.6 శాతమే ఇప్పటివరకు కనిష్ఠం కావడం గమనార్హం. కాగా, గత నెల 22న ఇదే సంస్థ 3.3 శాతం వాస్తవిక జీడీపీ వృద్ధిని అంచనా వేసిన సంగతి తెలిసిందే. 1970, 1980, 2009ల్లో ఆర్థిక మాంద్యం వల్ల నమోదైన వృద్ధి స్థాయిలకు మళ్లీ పరిస్థితులు దిగజారుతున్నాయని గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌ అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: రూ.3 లక్షల కోట్ల సమీకరణకు రాష్ట్రాలకు అనుమతి!

ABOUT THE AUTHOR

...view details