తెలంగాణ

telangana

ETV Bharat / business

మేకిన్‌ ఇండియాలో భాగం కానున్న అమెజాన్!​ - Amazon to start device manufacturing

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మేకిన్​ ఇండియాలో ప్రముఖ ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​ భాగం కానుంది. ఆ సంస్థ తయారు చేసి విక్రయించే పరికరాలను భారత్​లోనే తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను భారతీయ విభాగం సిద్ధం చేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

Amazon to start device manufacturing line in India
మేకిన్‌ ఇండియాలో భాగంకానున్న అమెజాన్​

By

Published : Feb 16, 2021, 8:35 PM IST

అమెజాన్ సంస్థ తయారు చేసి విక్రయించే పరికరాలను దేశీయంగానే ఉత్పత్తి చేయాలని ఆ సంస్థ భారతీయ విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. భారత ప్రభుత్వం మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌పై ఎక్కువగా దృష్టిపెట్టడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు నేడు ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిలో భాగంగా తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ సంస్థ చెన్నై విభాగంతో అమెజాన్‌ ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ విభాగం ఐఫోన్‌, ఐపాడ్స్‌, షావోమి పరికరాలను తయారు చేస్తోంది. ఫైర్‌ టీవీ స్టిక్స్‌ పరికరాలను భారీఎత్తున చెన్నై ప్లాంట్‌లో తయారు చేయాలని అమెజాన్‌ భావిస్తోంది. అవసరన్ని, డిమాండ్‌ను బట్టి వీటి తయారీని ఇతర పట్టణాలకు విస్తరించే అవకాశం ఉంది.

'ఆత్మనిర్భర్‌ భారత్‌ విషయంలో ఇక్కడి ప్రభుత్వానికి భాగస్వామిగా ఉండేందుకు కట్టుబడి ఉన్నాము. మేము 10లక్షల చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను డిజిటలైజేషన్‌ చేసేందుకు 1బిలియన్‌ డాలర్లను వెచ్చిస్తాము. ఇది ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులకు మార్కెట్‌ లభించి 10 బిలియన్‌ డాలర్ల వరకు ఎగుమతులు చేసే అవకాశం ఉంది. ఇది 2025 నాటికి దాదాపు పది లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది' అని అమెజాన్‌ గ్లోబల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.

దీనిపై కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్‌ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పందించారు. 'భారత్‌ పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రదేశం. భవిష్యత్తులో ఇది ఎలక్ట్రానిక్స్‌,ఐటీ పంపిణీ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మా ప్రభుత్వం ప్రారంభించిన ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్సెంటీవ్‌ స్కీం (పీఎల్‌ఐ)కు భారీ స్పందన లభిస్తోంది. చెన్నైలో తయారీపై అమెజాన్‌ తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. ఇది దేశీయ ఉత్పత్తి శక్తిని పటిష్టం చేస్తుంది' అని రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: దిల్లీ హైకోర్టులో ఫ్యూచర్ గ్రూప్​న​కు ఊరట

ABOUT THE AUTHOR

...view details