అంతర్జాతీయ దిగ్గజ సంస్థలైన అమెజాన్, యాపిల్‌లతో పాటు భారత్ నుంచి మహీంద్రా గ్రూప్, దాల్మియా సిమెంట్(భారత్)లు సున్నా కర్బన సాంకేతికత వైపు పనిచేయడానికి సిద్ధమయ్యాయి. ఇందు కోసం 'ఫస్ట్ మూవర్స్ కొయిలేషన్'లో వ్యవస్థాపక సభ్యులుగా ఈ కంపెనీలూ చేరాయని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) వెల్లడించింది. గ్లాస్గోలో జరుగుతున్న కాప్26 సదస్సులో ఈ సమాఖ్య ఏర్పాటు జరిగింది.
2050 పర్యావరణ లక్ష్యాలను చేరాలంటే సగం వరకు ఉద్గారాల తగ్గింపునకు సాంకేతిక అభివృద్ధి, ప్రొటోటైప్ దశలపైనే ఆధారపడాల్సి ఉంది. అదే సమయంలో ఈ దశాబ్దంలో ఈ సాంకేతికతలను మార్కెట్లోకి తక్కువ ధరకే తీసుకురావడం చాలా కీలకం. ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అమెరికా అధ్యక్ష ప్రత్యేక రాయబారి(పర్యావరణం) జాన్ కెర్రీతో కలిసి డబ్ల్యూఈఎఫ్ ఇక్కడ ఫస్ట్ మూవర్స్ కొయిలేషన్‌ను ప్రారంభించింది. ఈ కొత్త ప్లాట్‌ఫాం ద్వారా తక్కువ కర్బన సాంకేతికతకు సరికొత్త మార్కెట్ గిరాకీని సృష్టించే కొనుగోలు ఒప్పందాలను కంపెనీలు కుదుర్చుకోవడానికి వీలవుతుంది. ఈ ఒప్పందాల ద్వారా ఆయా సంస్థలు కర్బన నియంత్రణ సాంకేతికతను వాణిజ్యీకరణ చేయాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక పరిష్కారాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ దశాబ్దంలో పలు మైలురాళ్లను అధిగమించేలా ఈ సమాఖ్య దీర్ఘకాల ప్రభావం చూపగలదని భావిస్తున్నారు.
8 రంగాలపై..
మొత్తం ఎనిమిది రంగాలపై ఈ సమాఖ్య దృష్టి సారిస్తుంది.
- ఉక్కు, సిమెంటు, అల్యూమినియం, రసాయనాలు, నౌకాయానం, పౌర విమానయానం, ట్రక్కింగ్.. రంగాలు మొత్తం అంతర్జాతీయ కర్బన ఉద్గారాల్లో మూడో వంతుకు కారణమవుతున్నాయి.
- ఈ రంగాలు వినియోగిస్తున్న సంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయ.. స్వచ్ఛ ఇంధనాలు ఇంకా రాలేదు.
- ఎనిమిదో రంగం..'డైరెక్ట్ ఎయిర్ కాప్చర్' దీని ద్వారా సున్నా అంతర్జాతీయ ఉద్గారాలను సాధించడం కోసం వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయులను తగ్గిస్తారు.