తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్​ పిచాయ్​కు పద్మభూషణ్​ - alphabet ceo Sundar Pichai news

Sundar Pichai Padma Bhushan: ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్​కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం. 2022 సంవత్సరానికి గానూ విడుదల చేసిన పద్మ అవార్డులు పొందిన వారి జాబితాలో ఆయన పేరు ఉంది. ఈ సందర్భంగా టెక్​ ప్రపంచంలో అంచెలంచెలుగా ఎదిగిన సుందర్ పిచాయ్ ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం.

Alphabet CEO  Sundar Pichai conferred with Padma Bhushan
ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్​ పిచాయ్​కి పద్మభూషణ్​

By

Published : Jan 25, 2022, 10:11 PM IST

Sundar Pichai Padma Bhushan: టెక్ నిపుణుడు, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్​ పిచాయ్​ను పద్మ భూషణ్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్​ ప్రస్థానం, ఆయన ఆల్ఫబెట్ సీఈఓ బాధ్యతలు చేపట్టినప్పుడు చెప్పిన విషయాలు ఓసారి చూద్దాం.

గూగుల్‌ అనగానే వ్యవస్థాపకులు లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ల పేర్లే గుర్తుకొస్తాయి. కానీ వాళ్లిద్దరూ దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ని సుందర్‌ పిచాయ్‌కి అప్పగించి కార్యనిర్వాహక బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మార్పుతో ప్రపంచ టెక్‌ పటంలో భారతీయుల ఉనికిని మరోసారి చాటినట్లైంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన, ముఖ్యమైన టెక్‌ కంపెనీల్లో ఒకటైన ఆల్ఫాబెట్‌కి కర్త, కర్మ, క్రియ మన సుందరే. ఆయనకంటే ప్రతిభావంతులైన, అనుభవజ్ఞులైన వ్యక్తులు సంస్థలో ఉన్నా... నాయకుడిగా ఎవరూ సరితూగలేదు. చెన్నై నుంచి సిలికాన్‌ వ్యాలీ వరకూ సాగిన ప్రస్థానం ఆయన మాట్లల్లోనే..

చెన్నైలో చాలా సింపుల్‌గా జీవితం సాగిపోయేది. మేం అక్కడ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంట్లో ఉండేవాళ్లం. చుట్టాలు ఎవరైనా వస్తే తమ్ముడూ నేనూ కొన్నిసార్లు హాల్లో నేలమీద నిద్రపోయేవాళ్లం. క్లాసు పుస్తకాలతోపాటు ఇతర పుస్తకాలూ చదివేవాణ్ని. తమ్ముడూ నేనూ స్నేహితులతో సరదాగా గల్లీ క్రికెట్‌ ఆడటం, చదువుకోవడం... ఇదే జీవితం. కానీ అందులో ఏలోటూ కనిపించలేదు. నాకు స్వీట్స్‌ అంటే ఇష్టం లేదు. పాయసం ఇస్తే అందులో సాంబార్‌ కలిపి తాగేసేవాణ్ని.

మా చుట్టుపక్కల చాలా ఇళ్లల్లో ఫ్రిజ్‌లు ఉండేవి, మా ఇంటికి మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది. అప్పట్లో ఇంట్లో ఫ్రిజ్‌ ఉండటమనేది చాలా గొప్ప విషయంలా ఉండేది. అది కొన్నాక అమ్మకు వంటగదిలో పని తగ్గి మాతో ఎక్కువ సమయం ఉండేది. నాన్న ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌. అమ్మ స్టెనోగ్రాఫర్‌. కుటుంబమంతా ఒకే స్కూటర్‌మీద ఎక్కడికైనా వెళ్తుండేవాళ్లం. ఇంటికి ఫోన్‌, ఫ్రిజ్‌ ఇలా ఏదైనా వచ్చినపుడు వాటితో వచ్చే మార్పుల్ని గమనిస్తుండేవాణ్ని. అవి చూశాక సాంకేతిక రంగంపైన ఆసక్తి కలిగింది.

ఐఐటీ రోజులు...

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జీ ఇంజినీరింగ్‌ చేశాను. అందులో చేరినప్పటికీ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ రంగాలంటే ఇష్టం ఉండేది. ఆ పుస్తకాల్నీ తిరగేసేవాణ్ని. ఐఐటీకి వెళ్లిన కొత్తలో ‘అబే సాలే...’ అని విద్యార్థులంతా పిలుచుకునేవాళ్లు. అది తిట్టు అనే సంగతి నాకు తెలీదు. పిలుపు అనుకుని ఓసారి ‘అబే సాలే’ అని మెస్‌వాళ్లని పిలిచాను. దాంతో చిన్న గొడవ జరిగి ఓ పూట మెస్‌ మూసేశారు. ‘త్రీ ఇడియట్స్‌’లో చూపినట్లు ఐఐటీ క్యాంపస్‌ లైఫ్‌ ఎంతో సరదాగా ఉండేది.

అదే సమయంలో చదువుకీ ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం. నా శ్రీమతి అంజలి అక్కడే పరిచయం. తను నా క్లాస్‌మేట్‌. ఇప్పట్లా ఫోన్లు లేవు కదా, లేడీస్‌ హాస్టల్‌ దగ్గరకు వెళ్లి ఎవరైనా కనిపిస్తే ‘అంజలిని కాస్త పిలుస్తారా’ అని అడిగేవాణ్ని.

వాళ్లేమో గట్టిగా ‘అంజలీ... నీకోసం సుందర్‌ వచ్చాడు’ అని అరిచేవారు. నాకు చాలా సిగ్గుగా అనిపించేది. కంప్యూటర్‌ని మొదటిసారి చూసింది ఐఐటీలోనే. కాకపోతే చాలా అరుదుగా కంప్యూటర్‌మీద పనిచేసే అవకాశం వచ్చేది. మా వంతు వచ్చిన రోజున ఒక ఫ్లాపీ పట్టుకుని వెళ్లి పనిచేసుకుని ఫ్లాపీలో సమాచారాన్ని దాచుకునేవాళ్లం. ఐఐటీలోనే ప్రోగ్రామింగ్‌లో ప్రాథమిక అంశాల్ని నేర్చుకున్నాను. అక్కడ ఉన్నప్పుడే కంప్యూటర్‌ రంగంలో మంచి ఉత్పత్తుల్ని అభివృద్ధి చేయాలనీ, అవి అందరికీ ఉపయోగపడాలనీ కలలుగనేవాణ్ని. ఐఐటీ ఫస్టియర్‌లో నాకు మంచి గ్రేడ్‌ రాలేదు. తర్వాత మూడేళ్లూ జాగ్రత్తగా చదివాను. ఇప్పటికీ మా బ్యాచ్‌మేట్స్‌ అందరం తరచూ కలుస్తాం. మాకు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూప్‌లు కూడా ఉన్నాయి. గూగుల్‌ సీఈఓ అయ్యాక మొదటిసారి ఇండియా వచ్చినపుడు మనవాళ్ల స్పందన అద్భుతం. అది నా మూలాల్నీ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే విషయాన్నీ గుర్తుచేస్తుంది. ఎప్పటికైనా ఇండియా తిరిగొచ్చి నా దేశానికి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నా.

అమెరికా ప్రయాణం...

1993లో స్టాన్‌ఫర్డ్‌లో మెటీరియల్స్‌ సైన్స్‌లో ఎం.ఎస్‌. చేయడానికి చేరాను. అప్పటికి నాన్న నెల జీతం రూ.మూడు వేలు. అయినా తను పొదుపుచేసిన రూ.36వేలు పెట్టి నాకు విమానం టికెట్‌ కొని పంపారు. నేను మొదటిసారి విమానం ఎక్కింది అప్పుడే. సిలికాన్‌ వ్యాలీకి వెళ్లాలని చదువుకునే రోజుల్లో బాగా ఉండేది. అక్కడ అద్భుతాలు జరుగుతాయన్న భావన మా అందరిలో ఉండేది. నచ్చినంతసేపు కంప్యూటర్‌ వాడుకునే స్వేచ్ఛ స్టాన్‌ఫర్డ్‌లో ఉండేది. ప్రోగ్రామింగ్‌ కూడా ఎంతసేపైనా చేయొచ్చు. నేను ప్రోగ్రామ్‌, కోడింగ్‌ రాసుకుంటూ ఎక్కువ సమయం గడిపేవాణ్ని. ఇంటర్నెట్‌ని ఉపయోగించడం అస్సలు తెలిసేది కాదు. అమెరికా, ఇండియాల మధ్య వ్యత్యాసాలు చాలా ఎక్కువ. వాటిని అర్థంచేసుకోవడానికీ, అలవాటు చేసుకోవడానికీ చాలా టైమ్‌ పట్టింది.

‘నేను ఎక్కడ ఉన్నాను’ అనిపించేది కొన్నిసార్లు. కానీ అమెరికా ప్రత్యేకత ఏంటంటే ‘నువ్వు ఎక్కణ్నుంచి వచ్చావు’ అన్నదానికంటే ‘నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి’ అని చూస్తారు. స్టాన్‌ఫర్డ్‌లో ఎం.ఎస్‌. తర్వాత సెమీ కండక్టర్స్‌ తయారుచేసే ‘అప్లైడ్‌ మెటీరియల్స్‌’లో చేరాను. తర్వాత మెకన్సీలో, ఆపైన గూగుల్‌లో చేరాను.

నా దగ్గరా జవాబులేదు!

శుక్రవారం సాయంత్రం ఇంటికి రాగానే ఫోన్‌, ల్యాప్‌టాప్‌ పక్కన పడేసి సోమవారం ఉదయం వరకూ మళ్లీ తీయకూడదనుకుంటాను. కానీ అది ఎప్పుడూ సాధ్యపడదు. మా అమ్మాయి కావ్యకి 13 ఏళ్లు, అబ్బాయి కిరణ్‌కి 11 ఏళ్లు. కిరణ్‌ క్రిప్టోకరెన్సీ ఈదర్‌ని మైనింగ్‌ చేస్తాడు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించీ, వ్యాపారంలో ప్రాథమిక అంశాల గురించీ తెలుసుకున్నాడు. కానీ ప్రతి తరంలోనూ- సమాజంలో వచ్చే మార్పుల్ని చూసి తల్లిదండ్రులు పిల్లల గురించి ఆందోళన చెందుతారు. మా చిన్నపుడు ఎల్విస్‌ ప్రెస్లే ప్రభావం పిల్లలమీద ఉంటుందేమోనని తల్లిదండ్రులు బాగా భయపడేవారు. అయితే ఒకప్పటికంటే ఇప్పుడు మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి.

ఇంట్లో ఎప్పుడూ 20-30 ఫోన్లు ఉంటాయి. వాటిని వేర్వేరు టెక్‌ ఉత్పత్తుల్ని పరీక్షించడానికి ఉపయోగిస్తా. మరోవైపు పిల్లలకీ అదే ప్రపంచం అవుతుందేమోనన్న భయం నాకూ కలుగుతుంది. మన పిల్లలు పుస్తకాలు చదివితే ఓకే కానీ వాటిని కిండిల్‌లో చదివితే, యూట్యూబ్‌లో ఎడ్యుకేషనల్‌ వీడియోలు చూస్తుంటే ఎలా స్పందించాలో నాకూ తెలీదు. ప్రతి ఇంట్లో పిల్లల స్క్రీన్‌ టైమ్‌ గురించి చర్చలూ, బేరసారాలూ జరిగినట్లే మా ఇంట్లోనూ జరుగుతాయి. అయితే చాలామంది గూగుల్‌లో ఉన్నత స్థానాల్లో ఉన్న కంప్యూటర్‌ ఇంజినీర్లు స్కూల్‌ రోజుల్లో వీడియో గేమ్‌లు బాగా ఆడేవాళ్లమని చెబుతుంటారు. అందుకే కొన్నిసార్లు ఈతరం పిల్లల్ని సాంకేతిక ప్రపంచానికి తగ్గట్టు పెంచాల్సిందే అనిపిస్తుంది.

అయితే ‘ఎంతవరకూ’ అంటే... నేనూ సమాధానం కోసం వెతకాల్సిందే! పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి చూస్తాను. వాళ్లు చాలా విషయాల్ని యూట్యూబ్‌లో, గూగుల్‌లో వెతికి తెలుసుకున్నామని చెబుతారు. ‘నన్ను అడిగితే చెప్పేవాణ్ని’గా అంటాను.

అందుకే గూగుల్‌లో...

తమ ఉత్పత్తుల్ని ఉపయోగించి అందరూ సమాచారాన్నీ, విజ్ఞానాన్నీ చాలా సులభంగా పొందేలా చేయాలనేది గూగుల్‌ లక్ష్యం. నా వ్యక్తిగత ఆలోచనలూ, లక్ష్యాలూ ఇలానే ఉంటాయి. ఆ కారణంతోనే క్రోమ్‌, ఆండ్రాయిడ్‌ సహా ప్రతి ఉత్పత్తి కోసమూ ఎంతో ఉత్సాహంగా పనిచేయగలిగాను. యూట్యూబ్‌ లాంటి ఆప్స్‌తో గూగుల్‌ విద్యారంగంలో చాలా మార్పులు తెస్తోంది. గూగుల్‌ సేవల్లో సమానత్వం ఉంటుంది. వాడేది అయిదు వేల ఫోన్‌ అయినా, 50వేల ఫోన్‌ అయినా గూగుల్‌లో వెతికినపుడు ఒకే రకమైన సమాచారం కనిపిస్తుంది. గూగుల్‌ నుంచి ఏదైనా ఒక వేదికను సృష్టించాక వినియోగదారులు ఆ వేదికలమీద ఉద్యోగాలు సృష్టిస్తే చాలా సంతృప్తిగా ఉంటుంది.

మంచి ఆవిష్కరణలు రావాలంటే, ఒక అద్భుతమైన వ్యక్తికంటే కూడా మంచి బృందంవల్ల సాధ్యమవుతుంది. గూగుల్‌లో అలాంటి అద్భుతమైన బృందాలు చాలా ఉన్నాయి. నేను సీఈఓ అయ్యాక కంపెనీని ఒకప్పటి ‘మొబైల్‌ ఫస్ట్‌’ ఆలోచన నుంచి ‘ఏఐ ఫస్ట్‌’ వైపు తీసుకువెళ్తున్నా. మెషీన్‌ లెర్నింగ్‌, వాయిస్‌ రికగ్నిషన్‌ ప్రొడక్ట్స్‌ వైపు పరిశోధనలు జరుగుతున్నాయి. ఆల్ఫాబెట్‌ చాలా పెద్ద కంపెనీ. కానీ ఇందులో ఎన్నో చిన్న చిన్న విభాగాలు ఉన్నాయి. ఎంత పెద్ద ఆవిష్కరణ అయినా చిన్న బృందంతోనే మొదలవుతుంది. అత్యున్నత శిఖరంమీద ఉన్నపుడు మనం ఎక్కడ జారిపోతామో అన్న భయం ఉంటుంది. మన స్థానాన్ని ఇంకెవరైనా తీసుకుంటారేమోనన్న ఆలోచనలూ ఉంటాయి. నిజమైన నాయకుడు వాటిని దాటి ఆలోచించగలగాలి. లక్ష్యంవైపుగా తన బృందాన్ని ప్రోత్సహించాలి. వాళ్లని అద్భుతాలు చేయనివ్వాలి. వారి విజయమే తన విజయం అనుకోవాలి. అదే నేను ఫాలో అయ్యే నాయకత్వ విధానం.

సుందర్‌ ప్రస్థానం...

1993లో స్టాన్‌ఫర్డ్‌లో ఎం.ఎస్‌. చేయడానికి చేరారు. తర్వాత అప్లైడ్‌ మెటీరియల్స్‌లో ఉద్యోగం చేశారు.

* 2002లో వార్టన్‌లో ఎంబీఏ, ఆపై మెకన్సీలో కన్సల్టెంట్‌గా పనిచేశారు.

* 2004లో ఏప్రిల్‌ ఒకటిన గూగుల్‌లో చేరారు.

* 10మంది ఇంజినీర్ల బృందంతో వెబ్‌ బ్రౌజర్‌ క్రోమ్‌ని అభివృద్ధిచేశారు. 2008లో వచ్చిన క్రోమ్‌ ఇప్పుడు అత్యధికంగా వాడుతున్న సర్చింజిన్‌..

* 2013 నుంచి ఆండ్రాయిడ్‌ బాధ్యతల్ని తీసుకున్నారు. తర్వాత గూగుల్‌ బిజినెస్‌లో ప్రొడక్ట్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్ని చూసేవారు.

* 2015 నవంబరులో గూగుల్‌ సీఈఓగా బాధ్యతల స్వీకరణ. నాలుగేళ్లలో సంస్థ ఆదాయాన్ని సుమారు రూ.5.2 లక్షల కోట్ల నుంచి రూ.9.5లక్షల కోట్లకు పెంచారు. మార్కెట్‌ విలువనీ దాదాపు రెట్టింపు చేశారు.

* 2019 డిసెంబరు 3న ఆల్ఫాబెట్‌ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నారు.

ఒకప్పటి గూగుల్‌(క్రోమ్‌, ఆండ్రాయిడ్‌, యూట్యూబ్‌...)తోపాటు వేమో(సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్‌), క్యాలికో(వైద్య పరికరాల విభాగం), వింగ్‌(డ్రోన్‌ డెలివరీ సర్వీసు) సహా పలు విభాగాలు ఆల్ఫాబెట్‌లో ఉన్నాయి.

* వార్షిక వేతనం(అన్ని అలవెన్సులూ కలిపి) రూ.13.5కోట్లు.

ఉదయాన్నే పత్రిక చదువుతా...

ఉదయం ఆరున్నరా ఏడింటికి నిద్రలేస్తాను. టీ తాగుతూ పేపరు చదవడం అలవాటు. చిన్నప్పుడు ఇంట్లో తాత, నాన్న చదివాకగానీ నాకు పేపరు వచ్చేది కాదు. కానీ వాళ్ల మూడ్‌ని బట్టి స్పోర్ట్స్‌ పేజీని మాత్రం ముందు తీసుకునేవాణ్ని. ఇప్పటికీ రోజూ ఉదయాన్నే వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ హార్డ్‌కాపీనీ, న్యూయార్క్‌ టైమ్స్‌ ఆన్‌లైన్‌ కాపీనీ చదువుతాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తాను. నేను వెజిటేరియన్‌ని. బ్రేక్‌ఫాస్ట్‌కి ఆమ్లెట్‌, టోస్ట్‌ తింటాను.

*ఉదయం వ్యాయామం చేయను. ఆఫీసులో ఎక్కువగా నడవడానికి చూస్తాను. నడక సరిపోలేదనుకుంటే ఆరోజు సాయంత్రం జిమ్‌కి వెళ్తాను. ట్రెడ్‌మిల్‌ డెస్క్‌నీ ఏర్పాటు చేసుకున్నాను కానీ, నడుస్తూ ఈమెయిల్‌ టైప్‌ చేయడం, సర్చ్‌ చేయడం నావల్ల కాలేదు. నేను మల్టీ టాస్కింగ్‌ చేయలేను.

* చిన్నప్పట్నుంచీ క్రికెట్‌ ఫ్యాన్‌ని. మా స్కూల్‌ జట్టు కెప్టెన్‌ని కూడా. కానీ ఐఐటీ టీమ్‌కి ఎంపిక కాలేకపోయాను. గావస్కర్‌ క్రికెట్‌ ఆడే రోజుల్లో రేడియోలో కామెంట్రీ విన్నాను, తెందుల్కర్‌ క్రికెట్‌ని టీవీలో చూశాను. ఇప్పుడు కోహ్లీ క్రికెట్‌ని స్మార్ట్‌ఫోన్లో చూస్తున్నాను. క్రికెట్‌ని కచ్చితంగా ఫాలో అవుతాను. టీ20కంటే నాకు టెస్ట్‌, వన్డే క్రికెట్‌ ఇష్టం. ఫుట్‌బాల్‌ కూడా ఫాలో అవుతా.

* నడవనిదే నాకు ఆలోచన రాదు. దేని గురించైనా ఆలోచించాల్సి వస్తే తప్పకుండా నడుస్తూ ఆలోచిస్తాను. సమావేశాల్లో పరిష్కారం దొరకనపుడు బయటకు వెళ్లి నాలుగు అడుగులు వేసి తిరిగి వస్తా.

* నిద్రపోయేటపుడు మంచం పక్కన మంచినీళ్ల బాటిల్‌ పెట్టుకోవడం నాకు చిన్నప్పట్నుంచీ అలవాటు. అమెరికా వెళ్లినా ఆ అలవాటు పోలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:Padma Awards 2022: పద్మ అవార్డులు వరించింది వీరినే..

ABOUT THE AUTHOR

...view details