Bitcoin inventor: బిట్ కాయిన్ ఆవిష్కర్తగా చెప్పుకుంటున్న కంప్యూటర్ సైంటిస్ట్ క్రెగ్ రైట్‌కు భారీ ఊరట లభించింది. అమెరికా న్యాయస్థానంలో కొద్ది రోజులుగా కొనసాగుతున్న 5000 కోట్ల డాలర్ల (దాదాపు రూ.3.75 లక్షల కోట్ల) సివిల్ కేసులో ఈయనకు తీర్పు సానుకూలంగా వచ్చింది.
ఇదీ కేసు..
Bitcoin case: క్రెగ్ రైట్, డేవిడ్ క్లీమన్‌లు కలిసి భాగస్వామ్య పద్ధతిలో బిట్ కాయిన్‌లను కనిపెట్టారని, 11 లక్షల బిట్‌కాయిన్‌లను మైనింగ్ ద్వారా రూపొందించారన్నది క్లీమన్ కుటుంబసభ్యుల వాదన. 2013 ఏప్రిల్ లో డేవిడ్ క్లీమన్(46) మరణించగా, బిట్‌కాయిన్లలో సగం వాటా క్లీమన్‌కు చెందుతుందని, అది తమకు ఇప్పించాలని కోరుతూ క్లీమన్ సోదరుడు, కుటుంబసభ్యులు తరవాత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ బిట్‌కాయిన్లను క్లీమన్ కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఆ ఇద్దరు వ్యక్తులు ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థకు మేధోహక్కుల కింద 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.750కోట్లు)ను చెల్లించాలని ఫ్లోరిడా కోర్టు తెలిపింది. ఆ సంస్థే బ్లాక్‌చైన్, క్రిప్టోకరెన్సీ సాంకేతికతలకు ప్రారంభ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఇది తమకు అద్భుతమైన గెలుపు అని క్రెగ్ రైట్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. సోమవారం నాటి ట్రేడింగ్ ప్రకారం.. 11 లక్షల బిట్ కాయిన్‌ల విలువ 5000 కోట్ల డాలర్లు.
ఇదీ చూడండి:Crypto Assets Bill: 'క్రిప్టో కరెన్సీ' పేరు మార్చేందుకు కేంద్రం నిర్ణయం!