దేశీయంగా స్టాక్ మార్కెట్లోకి వస్తున్న కంపెనీల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇటీవల పెరిగిన ఐపీఓల సంఖ్యే ఇందుకు ఉదాహరణ.. ఇటీవలే జొమాటో ఐపీఓ ముగిసింది. ఈ ఇష్యూకు 38 రెట్ల అధిక స్పందన లభించింది. ఇటీవల పలు కంపెనీల ఇష్యూల్లో జారీ చేస్తున్న షేర్లకు కొన్ని రెట్లు అధికంగా బిడ్లు వస్తున్నాయి. అలాంటప్పుడు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఎన్నో కొన్ని షేర్లను ఆయా కంపెనీలు కేటాయిస్తాయా? ఏ ప్రాతిపదికన షేర్లు కేటాయిస్తారు? షేర్లు రాని వాళ్లు ఏం చేయాలి? షేర్లకు దరఖాస్తు చేసుకునేందుకు కట్టిన డబ్బులు ఎప్పుడు తిరిగి వస్తాయి? ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. వీటి సంగతి ఇప్పుడు చూద్దాం..
స్పందన ఆధారంగానే కేటాయింపు..
ఐపీఓలో దరఖాస్తు చేసుకున్న మదుపర్లకు ఆ ఇష్యూకి వచ్చిన స్పందన ఆధారంగా, సెబీ నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా షేర్ల కేటాయింపు జరుగుతుంది. ఒక ఇష్యూలో విక్రయానికి పెట్టిన షేర్లకు సమాన స్థాయిలో బిడ్లు లభించాయనుకుందాం. అప్పుడు మదుపర్లు ఎన్ని షేర్లకు బిడ్లు దాఖలు చేస్తే అన్నింటినీ సదరు కంపెనీ కేటాయిస్తుంది. ఒకవేళ జారీ చేస్తున్న షేర్ల కంటే.. ఎక్కువ మొత్తానికి బిడ్లు దాఖలైతే కేటాయింపు ప్రక్రియ సంక్లిష్టం అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొందరికి పూర్తిగా షేర్ల కేటాయింపు జరిగితే.. ఇంకొందరికి ఒక్క షేరు కూడా లభించకపోవచ్చు.
నిర్ణయం ఎలా?
పబ్లిష్ ఇష్యూల్లో జారీ షేర్లను చిన్న చిన్న లాట్లుగా విభజిస్తారు. షేర్ల సంఖ్యలో కాకుండా లాట్లలోనే మదుపర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక లాట్లో ఎన్ని షేర్లుండాలి? అనే విషయాన్ని కంపెనీ నిర్ణయిస్తుంది. లాట్‌లోని షేర్ల కంటే తక్కువ షేర్లకు బిడ్లు వేయడం కుదరదు. షేర్లను కేటాయించేటప్పుడు కూడా లాట్‌లోని షేర్ల కంటే తక్కువగా కంపెనీ కేటాయించకూడదు. షేర్ల కేటాయింపు విషయంలో 'నైష్పత్తిక ప్రాతిపదిక' అనేది కీలక పాత్ర పోషిస్తుంటుంది.
షేర్ల కేటాయింపు ఇలా..
ఉదాహరణకు.. కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ (క్యామ్స్) ఐపీఓనే చూద్దాం. ఈ ఐపీఓకు 46.99 రెట్ల స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా1,28,27,370 షేర్లను జారీ చేయగా.. ఇందులో 63,22,435 షేర్లను చిన్న మదుపర్ల కోసం అట్టే పెట్టారు. అయితే చిన్న మదుపర్లు 3,50,98,056 షేర్లకు బిడ్లు దాఖలు చేశారు. అంటే వాళ్ల కోసం అట్టే పెట్టిన షేర్ల కంటే 5.55 రెట్లు అధికమన్నమాట. క్యామ్స్ ఐపీఓలో లాట్‌కు 12 షేర్లుగా నిర్ణయించారు.
ఒక పబ్లిక్ ఇష్యూలో జారీ చేసిన షేర్ల కంటే ఎక్కువ షేర్లకు బిడ్లు వస్తే.. చిన్న మదుపర్ల కోసం అట్టే పెట్టిన షేర్లను, కనీస లాట్ పరిమాణంతో భాగించి ఎన్ని షేర్లను కేటాయించాలో నిర్ణయిస్తారు. ధరల శ్రేణిలోని గరిష్ఠ ధర లేదంటే అంతకుమించిన ధరను దాఖలు చేసిన బిడ్లను మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకుంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ప్రకారంగా.. క్యామ్స్‌లో 63,22,435 షేర్లను (అట్టేపెట్టిన షేర్లు) కనీస లాట్ పరిమాణలోని 12 షేర్లతో భాగిస్తే వచ్చిన 5,26,869 దరఖాస్తులను మాత్రమే షేర్ల కేటాయింపునకు పరిగణనలోకి తీసుకుంటారు. అయితే మొత్తం దరఖాస్తులు 21,08,682 వచ్చాయి. దీంతో 4.1 (21,08,682:5,26,869) నిష్పత్తిలో షేర్లను కేటాయిస్తారు. మిగిలిన దరఖాస్తులన్నింటిని తిరస్కరిస్తారు. అంటే లాటరీ ప్రకారంగా.. ఈ ప్రక్రియ జరుగుతుందని అనుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో చాలా మందికి ఒక్క షేరు కూడా కేటాయింపు జరగదు.