తెలంగాణ

telangana

ETV Bharat / business

Alibaba News: ఒక్క మాట ఖరీదు.. రూ. 25 లక్షల కోట్లు! - జాక్‌ మా

ఒక్క మాట ఖరీదు.. రూ. 25 లక్షల కోట్లు. చైనా బిలియనీర్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మాకు ఎదురైన పరిస్థితి ఇది (Alibaba News). సరిగ్గా ఏడాది క్రితం చైనా సర్కారుకు వ్యతిరేకంగా మాట జారి.. జాక్‌ మా కష్టాలు కొనితెచ్చుకున్నారు. చైనా పాలకుల ఆగ్రహానికి గురై 344 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో అక్షరాలా 25 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని కొనితెచ్చుకున్నారు.

Alibaba
అలీబాబా

By

Published : Oct 26, 2021, 6:50 AM IST

కాలు జారితే తీసుకోగలం.. కానీ మాట జారితే వెనక్కి తీసుకోలేం సరికదా దాని పర్యవసనాలు కూడా అనుభవించాల్సిందే..! చైనా బిలియనీర్‌, ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మాకు ఎదురైన పరిస్థితి ఇలాంటిదే (Alibaba News). సరిగ్గా ఏడాది క్రితం అనాలోచిత వ్యాఖ్యలు చేసి కష్టాలు కొనితెచ్చుకున్నారు జాక్‌ మా (Jack Ma Speech Against China). చైనా పాలకుల ఆగ్రహానికి గురై భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారు. మరి ఆ మాట ఖరీదు ఎంతో తెలుసా.. 344 బిలియన్‌ డాలర్లు. అంటే భారత కరెన్సీలో అక్షరాలా రూ. 25లక్షల కోట్లకు పైమాటే..!

ఇదీ ప్రసంగం..

అది 2020 అక్టోబరు 24.. చైనాలో 'ది బండ్ సమిట్‌' పేరుతో ఓ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న జాక్ మా ఓ ప్రసంగం చేశారు. అందులో చైనా ఆర్థికవ్యవస్థలోని లోపాలను ఉతికి ఆరేశారు (Jack Ma Criticize Government Speech). చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు అవసరమని సూచించారు. చైనాలో సచేతనమైన ఆర్థిక విధానాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి రోగికి తప్పుడు ఔషధాలు ఇచ్చినట్లే పనిచేస్తాయని ఎద్దేవా చేశారు.

చైనా ప్రభుత్వ ప్రతీకారం..

అసలే చైనాలో ఉన్నది జిన్‌పింగ్‌ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ. అందులోనూ జాక్‌ మా చేసిన వ్యాఖ్యలు నేరుగా జిన్‌పింగ్‌ను తాకాయి. మరి ప్రభుత్వం ఊరికే ఎలా ఉంటుంది. ప్రతీకారం మొదలుపెట్టింది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. జాక్‌ స్థాపించిన యాంట్‌ గ్రూప్‌ను ఐపీవోకు వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో స్టాక్‌ మార్కెట్లలో అలీబాబా షేర్లు కూడా పతనమవుతూ వచ్చాయి. ఇంకేముంది.. అలీబాబా గ్రూప్‌ సంపదతో పాటు జాక్‌ మా నికర సంపద కూడా హారతికర్పూరంలా కరగడం మొదలుపెట్టింది.

ఎంతలా అంటే ఏడాది కాలంలో అలీబాబా తన మార్కెట్‌ విలువలో 344 బిలియన్‌ డాలర్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది. ఒక్క అలీబాబానే కాదు.. దాని అనుబంధ సంస్థల షేర్లు కూడా భారీగానే పతనమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ విలువ కూడా ఒక ఏడాదిలో ఈ స్థాయిలో కరగలేదంటే.. చైనా పాలకుల చర్యలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు..!

ఇదీ చూడండి:'మట్కా మ్యాన్​'పై ఆనంద్​ మహీంద్ర పొగడ్తల వర్షం

ABOUT THE AUTHOR

...view details