ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ సేవలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రముఖ విమానయాన సంస్థలన్నీ లాక్‌డౌన్‌పై ట్విట్టర్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిపాయి. తమ భావాలను పరస్పరం పంచుకుంటూ.. ప్రస్తుత పరిస్థితుల్లో గగనతలంలో ఎగరడం కంటే నేలపై ఉండటమే మంచిదని ముక్తకంఠంగా స్పష్టం చేశాయి.
ఈ ఆసక్తికర ట్విట్టర్ సంభాషణను మొదట ప్రారంభించింది ఇండిగో. ఎయిర్ విస్తారాను ట్యాగ్ చేస్తూ.. "హే ఎయిర్ విస్తారా, ప్రస్తుతం మీరు విమాన సర్వీసులు నడపట్లేదని విన్నాం?" అని ట్వీట్ చేసింది. అలాగే స్టేయింగ్ పార్క్డ్స్టేయింగ్ సేఫ్, లెట్స్ఇండియాగో అనే హ్యాష్‌ట్యాగ్‌లు జోడించింది.
ఇండిగో ట్వీట్‌కు స్పందించిన ఎయిర్ విస్తారా.. "లేదు ఇండిగో, ఈ రోజుల్లో సర్వీసులను ఆపేసి విమానాలను నేలపై ఉంచడమే ఉత్తమమైన పని. ప్రస్తుతం సర్వీసులు కొనసాగించడమనేది తెలివైన ఎంపిక కాదు. గోఎయిర్... నువ్వు ఏమంటావ్?" అంటూ ప్రశ్నించింది.
విస్తారా ట్వీట్‌కు స్పందించిన గోఎయిర్.. "వందశాతం, విస్తారా! ఇంట్లో ఉండడం సురక్షితమైనది! అందరూ ఆకాశవీధుల్లో విహరించేంతవరకు మనం వేచి చూడగలం. ఎందుకంటే ప్రస్తుతం అందరూ ఎగరగలిగే పరిస్థితులు లేవు. నిజమేనా ఎయిర్ఏషియా?" అంటూ ఎయిర్‌ఏషియాను ప్రశ్నించింది.