తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనాతో విమానయాన రంగం కుదేలు

కరోనా నుంచి తిరిగి పుంజుకోగలమని గతేడాది  నవంబరులో చాలా వరకు విమానయాన కంపెనీలు నిబ్బరంగా చెప్పాయి. అయితే మలివిడత ఉద్ధృతితో ప్రస్తుతం బెంబేలు పడుతున్నాయి. పలు అంతర్జాతీయ మార్గాలు రద్దు కావడంతో ఇబ్బందుల్లో మునిగాయి. నిధుల కోసం ప్రభుత్వం, బ్యాంకులవైపు చూస్తున్నాయి.

flight
విమానయాన రంగంపై మళ్లీ కమ్మిన కారు మబ్బులు

By

Published : May 11, 2021, 7:16 AM IST

విమానయాన కంపెనీలు మళ్లీ సంక్షోభంలో పడ్డాయి. కొత్త కరోనా వేరియంట్లు విసురుతున్న సవాళ్లు, చాలా ప్రాంతాల్లో టీకా కార్యక్రమం నెమ్మదిగా జరుగుతుండడం వల్ల ఈ ఏడాది మరిన్ని నష్టాలు తప్పవని అంతర్జాతీయ విమాన రవాణ సంఘం(ఐఏటీఏ) కూడా చెబుతోంది. అంతక్రితం వేసిన అంచనాల కంటే 25% ఎక్కువగా అంతర్జాతీయ కంపెనీలకు 47.7 బి.డాలర్ల నష్టాలు తప్పవని అంటోంది.

అన్ని వైపుల నుంచీ కష్టాలు

గతేడాది కరోనా కారణంగా రెండో త్రైమాసికంలో ఆదాయాల్లో నిర్వహణ నష్టాలు 70 శాతానికి చేరాయి. వ్యయ నియంత్రణ చర్యలు, బలమైన కార్గో వ్యాపారం వల్ల 2020 ద్వితీయార్ధంలో నష్టాలు తగ్గాయి. అయితే కొన్ని స్థిర వ్యయాల కారణంగా 2020 చివరి త్రైమాసికానికి నష్టాలు 50 శాతానికే పరిమితం అయ్యాయి. తిరిగి కోలుకుంటామని నవంబరులో చాలా వరకు విమాన కంపెనీలు ధైర్యం వ్యక్తం చేశాయి. అంతలో మలి విడత కరోనా ఎదురైంది. చాలా వరకు దేశాలు భారత్‌కు, భారత్‌ నుంచి విమానాల విషయంలో ఆంక్షలు విధించాయి. ఇవి ఎప్పటికి తొలగుతాయో కూడా తెలియడం లేదు. కరోనాకు తోడు విమాన ఇంధన ధరలు పెరగడం మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి.

లీజుకిచ్చిన వారి నుంచీ సమస్యలు

తొలి విడతలో విమానాలు లీజుకిచ్చిన వారు కొంత దయ చూపారు. వాయిదాలు ఆలస్యమైనా ఓపిక పట్టారు. అయితే ఈ సారి అలా జరగకపోవచ్చని.. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో 250-300 విమానాలు ఎగరకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. లీజుకిచ్చిన వారంతా ఇపుడు కలిసికట్టుగా ఉన్నారనీ.. వారు విమానయాన సంస్థల అప్పులను రైటాఫ్‌ చేయరని అంటున్నారు.

నిధుల వేటలో కంపెనీలు

దేశీయ కంపెనీల విషయానికొస్తే అంతక్రితం 80 శాతంగా ఉన్న ప్యాసింజర్ల రద్దీ ఏప్రిల్‌లో 30 శాతానికి పడిపోయింది. మే నెలలో అది సగానికి పడిపోయినా ఆశ్చర్యం లేదు. దీంతో రోజువారీ ఖర్చులను భరించడం విమానయాన కంపెనీలకు భారంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇండిగో రూ.3,000 కోట్ల నిధుల సమీకరణలో పడింది. విచిత్రం ఏమిటంటే రికవరీ బాగుందన్న ఆలోచనతో గత జనవరిలోనే ఈ ప్రణాళికను పక్కనపెట్టింది. మార్కెట్లో 50% వాటా ఉన్న ఈ కంపెనీకే నిధుల అవసరం తప్పలేదు. అయితే క్రమంగా అయినా ఇండిగో గట్టెక్కుతుందని మార్కెట్‌ వర్గాలు అంచనాకడుతున్నారు. ప్రభుత్వం, బ్యాంకులు మద్దతిస్తేనే చిన్న సంస్థలు గట్కెక్కే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.

రూ.30,000 కోట్ల నష్టం?

గత ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీలకు 4-4.5 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.30,000-33,700 కోట్లు) నష్టం వాటిల్లిందని ఓ విమానయాన కన్సల్టెన్సీ నివేదిక చెబుతోంది. ఈ ఏడాది మరిన్ని నష్టాలు రావొచ్చని అంటోంది. గతేడాది స్థాయిలో డీలా పడినా...రెండేళ్లలో రూ.60,000 కోట్లకు పైగా నష్టమన్నమాట.

రికవరీ ఎప్పటికంటే..

ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, ఆదాయాలు కుదుటపడితే దేశీయ ప్రయాణాల్లో రికవరీని 2021 చివరికి కానీ చూడలేమని విశ్లేషకులు అంటున్నారు. 2022 తొలి త్రైమాసికానికి పరిస్థితులు చక్కబడినా ముందుగానే జరిగినట్లు భావించాలని చెబుతున్నారు. అంతర్జాతీయ రద్దీ తిరిగి కరోనాకు ముందు స్థాయులకు చేరాలంటే 2024లోనే చూడగలమని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి:ఖాతాల నిలిపివేతపై వాట్సాప్​ క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details