అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నందున విమాన ఇంధన (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్-ఏటీఎఫ్) ధరను 6.5 శాతం పెంచినట్లు సోమవారం చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. విమానాల ఇంధన ధర దిల్లీలో కిలోలీటర్‌కు రూ.3,663 పెరిగి, రూ.59,400.91కి చేరింది. ఫిబ్రవరి 16న ఏటీఎఫ్ ధర 3.6 శాతం మేర పెంచగా, అంతకు ముందు ఫిబ్రవరి 1న కిలోలీటరుకు రూ.3,246.75 చొప్పున పెంచారు. ఈ ధరల పెంపు వల్ల విమాన ప్రయాణాలు మరింత కాస్ట్లీ కానున్నాయి.
ఇండిగోకు 8 కొత్త విమానాలు
ఎనిమిది కొత్త ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాలకు సంబంధించి ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌తో కొనుగోలు-లీజ్‌బ్యాక్ ఒప్పందాన్ని విమానాల లీజింగ్ సంస్థ బీఓసీ ఏవియేషన్ కుదుర్చుకుంది. 2021 ద్వితీయార్థంలో ఈ విమానాలను డెలివరీ చేస్తామని బీఓసీ తెలిపింది. ‘బీఓసీతో మా సంబంధం బలోపేతమైనందుకు ఆనందంగా ఉంది. ఎనిమిది కొత్త ఏ320 నియో విమానాలు జత చేరనున్నందున, భారత విపణిలో మా వృద్ధిపై ధీమా పెరిగింద’ని ఇండిగో చీఫ్ ఎయిర్‌క్రాప్ట్ అక్విజిషన్, ఫైనాన్సింగ్ ఆఫీసర్ రియాజ్ పీర్‌మొహమ్మద్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'రోజుకు సగటున 33 కి.మీ. మేర రహదారుల నిర్మాణం'