ఇకపై దేశీయ విమాన ప్రయాణికులపై భారం పడనుంది. విమాన ఛార్జీల కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను 10-30 శాతం వరకు పెంచుతున్నట్లు.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించడమే ఇందుకు కారణం. ఈ కొత్త పరిమితులు ఈ ఏడాది మార్చి 31 లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అమల్లో ఉంటాయి.
ఏవియేషన్ మార్కెట్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించేందుకు ఛార్జీల పెంపు తప్పనిసరి అని పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే పెరుగుతున్న ఇంధన ధరలు కూడా ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొవిడ్ లాక్‌డౌన్ అనంతరం 2020 మే 25న దేశీయ విమానాలను పునః ప్రారంభించిన సమయంలో ప్రయాణ సమయాన్ని ఆధారంగా ఏడు శ్రేణుల్లో పరిమితులు విధించారు. కనిష్ఠ, గరిష్ఠ పరిమితుల సగటు ధర కంటే తక్కువకే దాదాపు 40 శాతం టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది.