ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకున్న తర్వాత.. అప్పులను బదిలీపై కేంద్రం దృష్టి సారించింది. సంస్థ బాధ్యతలు టాటా సన్స్‌కు అప్పగించే ముందే.. ఇంధన సరఫరా కంపెనీలకు చెల్లించాల్సిన రూ.16,000 కోట్ల బకాయిలను ప్రత్యేక సంస్థ ఎయిర్ ఇండియా అసెట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఏఐఏహెచ్ఎల్)కు బదిలీ చేయనున్నట్లు తెలిపింది.
అప్పులే కాకుండా.. చమురు మార్కెటింగ్ సంస్థలకు చెల్లించాల్సిన ఇంధన బిల్లులు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్, వ్యాపారులకు సంబంధించిన బకాయిలు ఏఐఏహెచ్ఎల్ భరించనున్నట్లు ప్రభుత్వ ఆస్తులు, పెట్టుబడుల నిర్వహణ సంస్థ (దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. డిసెంబర్ చివరి నాటికి ఈ అప్పులు మరింత పెరగకపోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అప్పటి వరకు సంస్థ రోజువారీ కార్యకలాపాలకు కావాల్సిన రూ.20 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం అందిస్తూ ఉంటుందని స్పష్టం చేశారు.
ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్‌కు అప్పగించే ముందు.. సెప్టెంబర్- డిసెంబర్ మధ్య కాలానికి బ్యాలెన్స్ షీట్లను క్లియర్ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఏవైనా లయబిలిటీ ఉంటే వాటిని.. ఏఐఏహెచ్‌ఎల్‌కు బదిలీ చేయనున్నట్లు పేర్కొన్నారు పాండే.