Air India TATA: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ఇండియాలో 100 శాతం వాటాలు పొందేందుకు 18 వేల కోట్లతో టాటాలకు చెందిన ప్రత్యేక సంస్థ టాలెస్ ప్రైవేటు లిమిటెడ్ దాఖలు చేసిన బిడ్‌కు గతేడాది అక్టోబరు 8న కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అదే నెల 11న ఈ బిడ్డింగ్‌ను ధ్రువీకరిస్తూ కేంద్రం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేసింది. అక్టోబరు 25న, ఈ ఒప్పందానికి సంబంధించిన షేర్ పర్చేస్ అగ్రిమెంట్‌పై ప్రభుత్వం సంతకం చేసింది. ఇక మిగతా ప్రక్రియ కూడా రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అవి పూర్తయిన వెంటనే ఈ వారాంతం నాటికి ఎయిర్ఇండియాను పూర్తిగా టాటాల చేతుల్లో పెట్టనున్నట్లు తెలిపాయి.
ఎయిర్ఇండియా ఫైనాన్స్ డైరెక్టర్ వినోద్ హెజ్మాది కూడా ఇదే విషయాన్ని సంస్థ సిబ్బందికి ఈ-మెయిల్ ద్వారా తెలియజేసినట్లు సమాచారం. జనవరి 27 నుంచి ఎయిర్ఇండియా నిర్వహణ టాటాలు అందుకోనున్నట్లు ఆయన తన మెయిల్‌లో పేర్కొన్నట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్ఇండియాతో పాటు ప్రధాన విమానాశ్రయాల్లో కార్గో, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలను అందించే ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, ఐఏఎస్‌ఏటీఎస్‌లో 50 శాతం టాటా గ్రూప్‌నకు దక్కనుంది. ఎయిర్ఇండియా రాకతో టాటా గ్రూప్ ఆధ్వర్యంలోకి మూడో విమానయాన బ్రాండ్ వచ్చినట్లవుతుంది. ఇప్పటికే విస్తారా, ఎయిరేషియా ఇండియాలో టాటాలకు మెజారిటీ వాటాలున్నాయి. ఎయిర్ఇండియా నిర్వహణ బాధ్యతలు వచ్చిన తర్వాత ఎయిరేషియా ఇండియా, ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను విలీనం చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేదు.