ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయానికి మరోసారి గడువు పెరిగింది. వాటాల కొనుగోలుకు ఆసక్తిగా ఉన్న సంస్థలు అక్టోబర్ 30 లోపు బిడ్లు సమర్పించొచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు 31తో ప్రస్తుత గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది.
కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఏర్పడిన అవాంతరాలను పరిగణనలోనికి తీసుకుని, ఈ గడువును పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది.
వాటా విక్రయం ఎందుకు..?
ఎయిర్ ఇండియాకు ప్రస్తుతం రూ.52 వేల కోట్లకుపైగా అప్పులు ఉన్నాయి. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన సంస్థ దాదాపు 23 వేల కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన అప్పులు ఎస్‌పీవీకి బదిలీ చేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది.
భారీ అప్పుల కారణంగానే ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజానికి 2018లో ఎయిర్ ఇండియా కొంత వాటా విక్రయానికి ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దీనితో ఈ మళ్లీ సంస్థ విక్రయానికి జనవరి 27న ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అప్పటి నుంచి పలు దఫాలుగా గడువును పెంచుతూ వస్తోంది
ఇప్పటి వరకు టాటా గ్రూప్ మినహా.. ఏ ఇతర సంస్థ ఎయిర్ ఇండియాలో వాటా కొనుగోలుకు ముందుకు రాలేదనే వార్తలు వస్తున్నాయి.
ఇదీ చూడండి:మూడు రోజుల్లో జీఎస్‌టీ సంఖ్య ఇలా