లాక్డౌన్ సడలింపులతో ఈ నెల ఆరంభంలో తిరిగి ప్రారంభమైన మద్యం విక్రయాలను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. ఇందులో భాగంగా ఒడిశాలో మద్యం హోం డెలివరీ చేసేందుకు సిద్ధమైంది ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో. ఇటీవలే ఝార్ఖండ్లో మద్యం హోం డెలివరీ సేవలు ప్రారంభించింది ఈ సంస్థ.
తొలుత ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఈ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు జొమాటో ప్రకటించింది. త్వరలోనే రాష్ట్రంలోని ఇతర పట్టణాలకూ సేవలు విస్తరిస్తామని వెల్లడించింది.
షరతులు వర్తిస్తాయి..
లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ.. వినియోగదారుల చిరునామా, వయస్సు తదితర వివరాలు నిర్ధరించుకున్నాకే వారికి మద్యం డెలివరీ చేస్తామని సంస్థ అధికారులు వివరించారు. ఇందుకోసం ఆన్లైన్లో మద్యం ఆర్డర్ ఇచ్చే యూజర్లు చెల్లుబాటులో ఉన్న ఆధికారిక గుర్తింపు కార్డులను ఆప్లోడ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
జొమాటోతో పాటు స్విగ్గీ కూడా ఈ నెల 21న రాంచీలో మద్యం హోం డెలివరీ సేవలు ప్రారంభించింది. ఇతర రాష్ట్రాలకూ ఈ సేవలు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి ఈ రెండు సంస్థలు.
ఇదీ చూడండి:'ఇంటి నుంచి పని'తో ఆఫీస్ స్థలం డిమాండ్లో క్షీణత!