రెండు దశాబ్దాల ప్రజాస్వామ్య పాలనను కూలదోసి.. అఫ్గాన్‌ను తాలిబన్లు చేజిక్కించుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు తాలిబన్లు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుత అస్థిర పరిస్థితులతో భారత్- అఫ్గాన్ ద్వైపాక్షిక వాణిజ్యం తీవ్రంగా ప్రభావితం కానున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అఫ్గాన్‌లో రాజకీయ పరిణామాలను గమనిస్తూ.. దేశీయ ఎగుమతిదారులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఈఓ) డైరెక్టర్ జనరల్ అజయ్ సాహీ సూచించారు. ముఖ్యంగా చెల్లింపుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
భారత్-అఫ్గాన్ వాణిజ్యం భారీగా పడిపోతుందని ఎఫ్ఐఈఓ మాజీ అధ్యక్షుడు ఎస్.కె.సరఫ్ పేర్కొన్నారు. అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయే అవకాశం లేదన్నారు . వారికి మన ఉత్పత్తుల అవసరం ఉండటం ఇందుకు కారణం స్పష్టం చేశారు.