కొవిడ్-19 వ్యాప్తి అరికట్టేందుకు రూపొందించిన సహాయ ప్యాకేజీని మూడింతలు చేస్తున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంకు తెలిపింది. సభ్యదేశాలకు 20 బిలియన్ డాలర్ల విపత్తు నిధి అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో పాటు దేశాలకు సౌకర్యవంతంగా సాయం అందించడానికి కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించే చర్యలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది.
వాటికి అదనం
మార్చి 18న ప్రకటించిన 6.5 బిలియన్ డాలర్ల ప్యాకేజీకి అదనంగా 13.5 బిలియన్ డాలర్లను చేర్చుతున్నట్లు ప్రకటనలో తెలిపింది ఏడీబీ. కొవిడ్ కారణంగా స్థూల ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థపై ఏర్పడ్డ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఈ అదనపు నిధులు సభ్యదేశాలకు ఉపయోగపడతాయని వెల్లడించింది. 20 బిలియన్ల ప్యాకేజీలో 2.5 బిలియన్ డాలర్ల రాయితీ, గ్రాంట్ నిధులు ఉన్నట్లు స్పష్టం చేసింది.
"ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని దేశాల ఆర్థిక సామాజిక ప్రగతిని మహమ్మారి వెనక్కి నెడుతోంది. పేదరికం తగ్గుదలలో వృద్ధిని తలకిందులు చేస్తూ ఆర్థిక వ్యవస్థలను మాంద్యంలోకి నెడుతోంది."-మసాట్సుగు అసకావ, ఏడీబీ అధ్యక్షుడు
ఆర్థిక వ్యవస్థలను ఈ మహమ్మారి తిరోగమన దిశలో నడిపిస్తోన్న సమయంలో అత్యవసర సవాళ్లను అధిగమించడానికి సభ్యదేశాలకు ఈ ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుందని అసకావ తెలిపారు.